హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ఠకు కాంగ్రెస్ ప్రభుత్వం భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఓయూకు కరెంట్ ఇవ్వలేమని, నీళ్లు అందించలేమని, విద్యార్థులు వెంటనే హాస్టళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని తెలిపారు. యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లిపోయాలని యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ విద్యార్థులకు నోటీసులు ఇలా ఇస్తారని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బొత్తిగా అవగాహన లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
వీసీ అనుమతి లేకుండా చీఫ్ వార్డెన్ విద్యార్థులకు నోటీసులు ఎలా ఇస్తారన్నారని, ఈ విషయంపై కేసీఆర్ స్పందించిన తర్వాతే ప్రభుత్వం స్పందించి, చీఫ్ వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ప్రభుత్వం కావాలనే యూనివర్సిటీ నుంచి విద్యార్థులను వెల్లగొట్టే కుట్రకు దిగిందని పేర్కొన్నారు. యూనివర్సిటీలో నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఉంటే సెలవులు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. యూనివర్సిటీ విద్యార్థులంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
దుగానే నోటీసుల సేకరణ ఎందుకు?
వర్సిటీ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ సోమవారం జారీచేసిన నోటీసు వివాదాస్పదంగా మారడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి విద్యుత్‌శాఖ, జలమండలి అధికారులు వేర్వేరు పత్రికా ప్రకటనల ద్వారా కరెంటు, నీటి సరఫరా బాగానే ఉందంటూ సమర్థించుకున్నారు.
ఈ నేపథ్యంలో గతంలో నోటీసులు ఎలా ఉన్నాయని పరిశీలించేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించగా.. వాటన్నింటినీ రెండు రోజుల కిందటే చీఫ్ వార్డెన్ తీసుకెళ్లారని, తమ దగ్గర వాటి తాలూకు కాపీలు కూడా లేవని సంబంధిత కార్యాలయ సిబ్బంది చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది. ‘నమస్తే తెలంగాణ’ చీఫ్ వార్డెన్‌ను సంప్రదించగా… సీఎం రేవంత్‌రెడ్డి పోస్టు చేసిన పాత నోటీసు కాపీని మాత్రమే పంపారు. అసలు ప్రతి (ఒరిజినల్) కాపీని పంపాల్సిందిగా కోరితే… ఒరిజినల్ కాపీ గతంలో నోటీసు బోర్డుపై అంటించారని, తమ దగ్గర జిరాక్స్ ప్రతులే ఉన్నాయంటూ సమాధానమివ్వడం గమనార్హం.