హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచేశారు. గోదావరి నదిపై ప్రాజెక్టులను ఎన్నడూ తాను అడ్డుకోలేదన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు హస్యాస్పందమని పేర్కొన్నారు.
గోదావరిపై అన్ని అనుమతులు సాధించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఒకవైపు అడ్డుకుంటూ, భక్త రామదాసు ప్రాజెక్టు పనులనూ ఆపాలని కేంద్రానికి లేఖ రాశారని ఆయన గుర్తుచేశారు. అలాగే పాలమూరు రంగారెడ్డి-ఎత్తిపోతల పథకాన్ని కూడా అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడేమో నీతులు వల్లిస్తున్నాడని దుయ్యబట్టారు. రెండుకండ్ల సిద్ధాంతంతో చంద్రబాబు మరో సారి తెలంగాణకు ద్రోహం చేసే కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణ నదీజలాలు చంద్రబాబు తరలించుకు పోతుంటే సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుమాలిన వ్యవహారం అని పేర్కొన్నారు.