Devi Prasad | రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలన కేంద్రమైన తెలంగాణ సచివాలయానికి ఏం సంబంధం అని బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్ ప్రశ్నించారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తెలంగాణ ప్రజల మనసు గాయపరచడమే అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పదే పదే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు పేర్లు ప్రస్తావిస్తున్నారని దేవీప్రసాద్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రాంతీయేతరుల పాత్ర ఉన్నా, కేసీఆర్ పాత్ర లేదంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన మంచిని చెప్పడానికి రేవంత్ రెడ్డికి నోరు రావడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేక వైఖరి దీన్ని బట్టే తెలుస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు, కేసీఆర్ పేరు అని స్పష్టం చేశారు.
15 కేబినెట్ సబ్ కమిటీలను కాలయాపన కోసమే వేశారని దేవీప్రసాద్ అన్నారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తే, కేసీఆర్ పేరును తీసేసినట్టేనని రేవంత్ భావిస్తున్నట్టున్నారని అన్నారు. అన్ని అవమానాలకు లెక్క కడుతున్నామని చెప్పారు. నిన్న కూడా మెదక్ జిల్లాలో స్వాతంత్ర్య వేడుకల ఆహ్వాన పత్రికలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల నుంచి నిరసన వచ్చే సరికి మళ్లీ ఆహ్వాన పత్రికను మార్చారని అన్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.