హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): అదానీ వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. అదానీ అవినీతిపై నిగ్గుతేల్చాలని ఈడీ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ధర్నా నిర్వహించిందని, ఆయన సీఎం హోదాలో అదానీ గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకున్నారని గుర్తు చేశారు.
2024 జనవరిలో రేవంత్‌రెడ్డి సర్కార్ డేటా స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ, సిమెంట్, డిఫెన్స్, ఏరో స్పేస్‌తో సహా వివిధ రంగాల్లో రూ.12,400 కోట్ల పెట్టుబడుల విషయంలోనే కాకుండా హైదరాబాద్‌లోని పాతబస్తీలో విద్యుత్తు బిల్లుల వసూలుకు అదానీ గ్రూప్‌నకు అనుమతులు ఇచ్చిన విషయాలను ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
ఈ దశలో అదానీతో సీఎం రేవంత్‌రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేస్తారా? లేదా? అని ్రప్రశ్నించారు. బీజేపీతో కుమ్మక్కు అయింది.. రేవంత్‌రెడ్డేనని విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈడీ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి నిరసన తెలిపారని పేర్కొన్నారు.
అదానీ విషయంలో రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై తేల్చుకోవాలని ఆయన రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గేకు సూచించారు. తక్షణమే అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.