హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తేతెలంగాణ): లిక్కర్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి, వారికి అనుకూలంగా బీర్ల ధరలు పెంచిన సీఎం రేవంత్‌రెడ్డిది క్విడ్‌ప్రోకో పాలసీ అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఘాటుగా విమర్శించారు. నాడు లిక్కర్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గెదేలేదని చెప్పి, ఇప్పుడు వారికి అనుకూలంగా ఎందుకు ధరలు పెంచారని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
‘లిక్కర్ కంపెనీలు 33 శాతం బీర్ల ధరలు పెంచమంటున్నయ్.. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదని బీరాలు పలికిన మీరు.. ఇప్పుడు బీర్ల ధరను ఎందుకు పెంచారు? లిక్కర్ లాబీకి తలొగ్గే నిర్ణయం తీసుకున్నారా?’ అంటూ లేఖలో శ్రవణ్ ప్రశ్నించారు. అసలు సర్కారును నడుపుతున్నది మీరా? లిక్కర్ కంపెనీలా? అని నిలదీశారు. కొందరు కార్పొరేట్ల మేలు కోసమే బీర్ల ధరలను 15 శాతం పెంచి పేదలపై భారం వేయడం తగదని ఆక్షేపించారు.
‘ఎన్నికల ముందు మీ మాటలు నమ్మి ఒటేసిన వారికి ద్రోహం చేయడం ఎంతవరకు సమంజసం’ అని ప్రశ్నించారు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించిన తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ట్యాక్స్ (ఆర్ఆర్) అమలవుతున్నదనే విషయం తెలిసిపోతున్నదని ధ్వజమెత్తారు. ఎన్నికల హామీల అమలును విస్మరించి ప్రజలను దోచుకోవడమే పనిగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని ఆక్షేపించారు. వెంటనే పెంచిన బీర్ల ధరలను ఉపసంహరించుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.