హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం వాడిన పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డిని పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు పిండం పెట్టాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డిని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించవచ్చునని చెప్పారు. రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ శ్రేణులు పిండాలు పెడుతాయని, రౌడీ రేవంత్.. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. శనివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ వైఖరి దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టుగా ఉన్నదని, పది రోజులుగా వర్షాలు పడుతుంటే ఎక్కడ పడుకున్నావు? అని ప్రశ్నించారు.
మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ‘మా ఎంపీ ఎక్కడా?’ అంటూ పోస్టర్లు వేయడంతో రేవంత్ బయటికి వచ్చాడని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదైందని, క్లౌడ్బ్లరస్ట్ అయిందని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విపత్తు సమయంలో మానవీయ కోణంతో స్పందించాలని, ప్రజలకు అండగా ఉండాలని, మానవత్వం లేకుండా వ్యవహరించవద్దని హితవు చెప్పారు. రేవంత్‌ను కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే.. అన్నట్టుగా ఆయన వ్యవహారశైలి ఉన్నదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రేవంత్ తన భాషను మార్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ వ్యాఖ్యలపై ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
మీడియాపై దాడికి ఖండన
రేవంత్ ఉప్పల్ పర్యటనలో భాగంగా రేవంత్ గూండాలు మీడియా ప్రతినిధులపై దాడుల చేశారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దాసోజు శ్రవణ్ అన్నారు. మీడియా ప్రతినిధులతోపాటు దళిత, బహుజన ప్రతినిధులకు దెబ్బలు తగిలాయని ఆందోళన వ్యక్తంచేశారు. బాధితులు ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, వారికి పోలీసులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
నువ్వు చేసిన అభివృద్ధి ఏమిటి?
ఎంపీగా రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ఏమిటో చెప్పాలని జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ డిమాండ్ చేశారు. అధిక వర్షాల కారణంగానే వరదలు వచ్చాయని, 65 సెంటీమీటర్ల వర్షాలు పడితే ఎవరూ ఏమీచేయలేరని చెప్పారు. కాంగ్రెస్, రేవంత్ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారో చెప్పాలని నిలదీశారు. నియోజకవర్గంలో రేవంత్‌కు పిండాలు పెడుతారని, ఆయనను ఉరికించి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. రేవంత్ లాంటి భాష దేశంలో ఎవ్వరూ వాడరని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.