హరీశ్‌రావుపై రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడిందని.. ముందుగా వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణ వేస్తే ముందుగా రేవంత్ రెడ్డి అల్లుడిపై వేయాలన్నారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బాలరాజు యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. నిప్పులాంటి నాయకుడు హరీశ్‌రావు అని తెలిపారు. ఆరడుగుల బుల్లెట్, నీతి నిజాయితీ గల నాయకుడు అని కొనియాడారు. హామీలపై ప్రశ్నిస్తుంటే హరీశ్‌రావుపై రాళ్ల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకో కేసు పేరుతో బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం, ధరణి కుంభకోణాలు అన్నారని.. చివరకు ఏమైందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. సూర్యుడి మీద ఉమ్మివేస్తే మీ మీదనే పడుతుందని అన్నారు. హరీశ్‌రావు ఎటువంటి తప్పు చేయకపోయినా ఆయనపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర మంత్రుల మధ్య సమన్వయం లేదని వార్తలు వస్తున్నాయని బాలరాజు యాదవ్ తెలిపారు. బొగ్గు టెండర్ల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు కొట్లాడుతున్నారని విమర్శించారు. దోచుకుంటున్న సొమ్ములో వాటాల పంచాయితీతోనే మంత్రుల మధ్య గొడవలు వస్తున్నాయని తెలిపారు. మంత్రుల మధ్య గొడవ ఉందనే రేవంత్ రెడ్డి దావోస్ పారిపోయాడని అన్నారు.