Patlolla Sanjeeva Reddy | నారాయణఖేడ్, ఏప్రిల్ 21 : ‘ఈ గవర్నమెంట్లో దేనికీ గ్యా రెంటీ లేదు’ అని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యక్తం చేసిన నిస్సహాయత ఇది. నీటి సమస్యను తీర్చాలని కోరిన ఓ వ్యక్తితో నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్‌రెడ్డి అన్న ఈ మాటల వీడియో కాస్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వ్యక్తి, ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడుతూ నీటి సమస్యకు కారణమైన అధికారుల వేతనాలు ఆపాలని సూచించారు. అలా చేస్తే ఇంకా బద్నాం అవుతామని ఎమ్మెల్యే బదులిచ్చారు. త్వరలో రూ.2 కోట్ల నిధులు మంజూరవుతాయని, బోర్లు వేసి నీటి సమస్యను తీరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చా రు.
ఎప్పటిలోగా బోర్లు వేస్తారని సదరు వ్యక్తి అడగడంతో ‘ఎప్పటిలోగా అనేది గ్యారెంటీ లేదు’ అని ఎమ్మెల్యే నిస్సహాయతను వ్యక్తంచేయడం గమనార్హం. ఇదే మాటను మరోమారు పునరుద్ఘాటిస్తూ ఈ గవర్నమెంట్లో దేనికీ గ్యారెంటీ లేదు.. అని స్పష్టంచేశారు. దీంతో ఎమ్మెల్యేతో ఫోన్లైన్లో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేకు చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో మీరు రాసిచ్చినా బాండ్ పేపర్‌కూ గ్యారెంటీ లేదా? అనడంతో ఎమ్మెల్యే బదులిస్తూ ‘ఫోన్లో కాదు నీ సమస్య ఏమిటో నేరుగా వచ్చి కలిసి చెప్పాలి’ అని ముగించారు.
కంగ్టి, ఏప్రిల్ 21 : సొంత ప్రభుత్వంపైనే నిస్సహాయతను వ్యక్తంచేస్తూ మాట్లాడిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి ఆడియోను వైరల్ చేశాడని ఓ బీఆర్ఎస్ నాయకుడిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి ఆడియోను వివిధ గ్రూపుల్లో వైరల్ చేసినందుకు సంగారెడ్డి జిల్లా ముర్కుంజాల్ బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ జాగృతి కంగ్టి మండల అధ్యక్షుడు కురుమ జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కంగ్టి మం డల నాయకుల ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎస్సై వివరించారు. కాగా, ఫోన్ ఆడియోలో ప్రస్తుత ప్రభుత్వం నిధుల కేటాయింపుపై తనకే నమ్మకం లేదని నారాయణఖేడ్ ఎమ్మల్యే సంజీవ్‌రెడ్డి మాట్లాడిన ఈ ఆడియో రికార్డు నియోజకవర్గంలో బాగా వైరల్ అయ్యింది.