Telangana | లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వర్ రావు పది రోజులకు పైగా చావుబతుకుల్లో కొట్టుమిట్టాడి మరణించడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న నాగేశ్వర్ రావును బుధవారం ఉదయం ఆసుపత్రిలో పరామర్శించానని తెలిపారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స ఇవ్వాలని కోరానని.. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పానన్నారు. కానీ రాత్రికి రాత్రే నాగేశ్వర్రావు ఇలా మరణించడం మనసును కలచివేసిందని అన్నారు.
తన కోసం కాకుండా తన వాళ్లకు ఇళ్లు రాలేదని మరణించడం నాగేశ్వర్రావుకు సమాజం పట్ల ఉన్న ఆవేదనకు, ఆలోచనకు అద్దం పడుతుందని ఏనుగుల రాకేశ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం మూర్ఖత్వం వల్ల ఇలా ఎంతో మంది పేదలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని.. వాళ్ల ఆశలు అడియాశలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగానే పరిగణించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని సరైన పద్ధతిలో అమలు చేసి ఉంటే నాగేశ్వర్ రావు మరణించే వారు కాదని పేర్కొన్నారు.
ఇంత జరిగితే కనీసం మంత్రి సీతక్క నాగేశ్వర్ రావు ను పరామర్శించకపోవడం, కనీసం స్పందించకపోవడం దురదృష్టకరమని ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం అందించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.