హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): వడ్ల కొనుగోలులో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన సంతోష్ అనే రైతు కష్టాలే నిదర్శనమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ సిద్దిపేట జిల్లా గాగులాపూర్ అన్నపూర్ణ రైస్ మిల్లుకు ఐదు లారీలు వడ్లు పంపారని, ఐదు రోజులైనా ప్రభుత్వం కొనడం లేదని, అధికారులు జాప్యంతో ధాన్యం మొలకెత్తిందని పేర్కొన్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని కొనడం సాధ్యంకాదని, తిరిగి తీసుకెళ్లాలని చెప్తున్నారని హరీశ్‌రావు ఆ పోస్టులో పేర్కొన్నారు.
అధికారుల కాళ్లావేళ్లా పడితే లారీకి 50 బస్తాల తరుగు తీసేస్తేనే కొంటామని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదు రోజులుగా డ్రైవర్లకు భోజన వసతి సదుపాయాల ఖర్చును సంతోష్‌తో పాటు గ్రామస్తులు భరిస్తున్నారని, మొలకెత్తిన వడ్లను కొంటామని ప్రభుత్వం చెప్తున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదని మండిపడ్డారు. సంతోష్ తనకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారని, మెదక్, సిద్దిపేట కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి సంతోష్ సమస్యను పరిషరించాలని హరీశ్‌రావు కోరారు.