హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ గళాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించడంలో, స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటడంలో అగ్రగామిగా నిలిచిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక 15వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజల అక్షర ఆయుధంగా నిలిచిన పత్రిక యాజమాన్యానికి, జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న క్లిష్ట సమయంలో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఆవిర్భవించిన తీరును గుర్తు చేసుకున్నారు.
‘తెలంగాణ ప్రజల గొంతును బలంగా వినిపించడానికి, స్వరాష్ట్ర ఆకాంక్షను చాటడానికి, తెలంగాణ వ్యతిరేకులు పన్నిన కుట్రలను పటాపంచలు చేయడానికి పురుడు పోసుకున్న అక్షర ఆయుధం నమస్తే తెలంగాణ దినపత్రిక’ అని కొనియాడారు. ‘మన పత్రిక.. మన ఆత్మగౌరవం’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ పత్రిక, 15 ఏండ్లుగా నిరంతరాయంగా అక్షర కవాతు చేస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్నదని పేర్కొన్నారు.
తమ కలం ద్వారా తెలంగాణ గళాన్ని నిరంతరం నలుదిశలా వినిపిస్తున్న ‘నమస్తే తెలంగాణ’ పత్రికకు చెందిన ప్రతి ఒకరికీ కృతజ్ఞతలు తెలిపారు. పత్రిక యాజమాన్యానికి, సంపాదక బృందానికి, జర్నలిస్ట్ మిత్రులకు, క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న జిల్లాలు, మండలాల విలేకరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.