హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ ఏకమై ఉమ్మడి ఉద్యమాలు నిర్వహించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్యక్షతన శనివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు నేతలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్మిక హక్కులను హరించి వేస్తున్నదని, కాంగ్రెస్ సర్కారు అసలు కార్మికులే లేకుండా చేస్తున్నదని మండిపడ్డారు. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉమ్మడి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. పెన్షనర్ల హక్కులను కుదించేందుకు, వారికి రావాల్సిన డబ్బులపై ఎలాంటి హక్కులు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో చట్టం తీసుకొనిరాబోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కార్మిక చట్టాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించి, పోరాటంలో భాగస్వాములను చేయాలని సూచించారు.
పార్లమెంట్ సరిగా పనిచేయకపోవడం వల్ల లేబర్‌కోడ్ లాంటి చట్టాలు ఆమోదం పొందుతున్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. దేశంలో అమలవుతున్న 29 చట్టాలను కుదించి, నాలుగు కోడ్లుగా చేశారని వివరించారు. రైతుల చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గేదాకా పోరాడిన విధంగానే, నాలుగు లేబర్ కోడ్లను వెనక్కు తీసుకునేంత వరకు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హయాంలో కేంద్రం తప్పుడు చట్టాలు తెచ్చినా, ఇక్కడ నష్టం జరుగకుండా కార్మికులను కాపాడుకున్నారని గుర్తుచేశారు. లేబర్కోడ్లపై అనేక రాష్ట్రాలు నిబంధనలు రూపొందించకపోయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆదరాబాదరగా, తొందరపడి నిబంధనలు రూపొందించిందని దుయ్యబట్టారు.
నాలుగు లేబర్కోడ్లు భయంకరంగా ఉన్నాయని కార్మిక శాఖ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మండిపడ్డారు. లేబర్కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటాలు చేయాలని, అవసరమైతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఎంతదూరమైనా వెళ్లి, ఆ నాలుగు కోడ్లు అమల్లోకి రాకుండా నిలువరించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈఎస్ఐ దవాఖానల్లో మందు గోళీలకు కూడా దిక్కు లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచగా వచ్చిన మొత్తంలో 20% కార్మికులకు ఇవ్వాలని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. హిల్ట్ పాలసీలో పారిశ్రామికవేత్తలు పొందుతున్న లబ్ధిలో 30% కార్మికులకు కేటాయించాలని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సాగే ఉద్యమానికి తన వంతుగా రూ.పది లక్షలు విరాళంగా ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు దుర్మార్గంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. ఈ కోడ్లు ఉద్యోగ భద్రతను దూరం చేసేలా ఉన్నాయని, ఆరోగ్య కారణాలు చెప్పినా, కార్మికులకు సెలవులు ఇవ్వని దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయపరంగా కూడా లేబర్ కోడ్లను అడ్డుకోవాలని సూచించారు.
నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వీటిని కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబుయాదవ్ హెచ్చరించారు. లేబర్కోడ్లపై శనిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి కొన్ని సంఘాలనే పిలిచామని, ఇకముందు కలిసి వచ్చే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోవాలని తీర్మానం చేసినట్టు వెల్లడించారు.
నాలుగు లేబర్ కోడ్ల వల్ల ప్రైవేటు సంస్థల్లో పని చేసే కార్మికులకు భద్రత లేకుండా పోతుందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. కార్మికుల హక్కుల హననం విషయం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఒక్కటిగానే ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీలు వేరైనా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపైకి వచ్చి, కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. దేశంలోని అన్ని పరిశ్రమలను అదానీ హస్తగతం చేసుకుంటున్నారని, అలాంటి బడా పారిశ్రామికవేత్తల కోసమే కొత్త లేబర్కోడ్లు తెచ్చారని విమర్శించారు. కార్మిక సమస్యలపై పోరాడేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కాల్‌సెంటర్ ఏర్పాటుచేయాలని సూచించారు.