హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): దేశంలో ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలున్నాయని, అవి ప్రజల విశ్వసనీయత కోల్పోయాయని, కాబట్టి వచ్చే అన్ని ఎన్నికలను పేపర్ బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. నవంబర్‌లో జరగబోయే బీహార్ అసెంబ్లీతోపాటు ఆ తర్వాత వచ్చే అన్ని సాధారణ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరపాలని కోరారు. ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) కార్యాలయంలో ఈసీ అధికారులతో కేటీఆర్ నేతృత్వంలో పార్టీ సభ్యుల బృందం సమావేశమైంది.
ఎన్నికల సంసరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చించింది. అనంతరం రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, బాల్క సుమన్, మాలోతు కవిత, పార్టీ నేతలు పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చామని, దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు, తీసుకురావాల్సిన సంసరణలపై స్వేచ్ఛగా వివరించామని చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టోకు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే వాటిని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీదనే ఉన్నది. ఎన్నికల్లో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అవసరమైతే వారి సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
-కేటీఆర్
కాళేశ్వరం నివేదిక పేజీలను 650 నుంచి 60 పేజీలకు కుదించడంలోనే వారి బాగోతం అర్థమైంది. అంటే 600 పేజీల్లో వారికి ఇష్టం లేనివి ఉన్నాయి. 60 పేజీల్లో వారికి ఇష్టమున్నయి ఉన్నయ్. కాబట్టి వాటిని చూపించే ప్రయత్నం చేశారు. రిపోర్టు ఇచ్చింది సాయంత్రం.. అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు.
-కేటీఆర్
దేశంలో మళ్లీ బ్యాలెట్ ఓటింగ్ విధానం తీసుకురావాలని ఈసీని కోరినట్టు కేటీఆర్ చెప్పారు. ‘ఇవాళ ఈసీ ముందు ఆరేడు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయం చెప్పాం. ఈ రోజు అమెరికా, యూకే, జర్మనీ, ఇటలీ సహా అనేక దేశాలు కొంతకాలం వరకు ఈవీఎంలను ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పటికీ వాటిపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈవీఎంలను రద్దు చేసి పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 140 కోట్ల జనాభా. సుమారు 100 కోట్ల ఓటర్లు ఉన్న దేశం మనది. ఇలాంటి దేశంలో ఓటింగ్ మిషన్ల వల్ల నష్టం జరుగుతున్నది.
మనం వేసిన ఓటు మనం అనుకున్న వారికి పడటం లేదనే అనుమానాలు ఉంటే అది ప్రజాస్వామ్యానికే చేటు. కాబట్టి ఈవీఎంలను పక్కనబెట్టి తిరిగి బ్యాలెట్ పద్ధతిని తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్‌ను కోరాం. నవంబర్‌లో జరిగే బీహార్ ఎన్నికల నుంచి బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిని కూడా ప్రవేశపెట్టాలని సూచించాం. ఆ తర్వాత వచ్చే అన్ని సాధారణ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తిచేశాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
అడ్డగోలు హామీలిచ్చి అధికారం చేపట్టి ప్రజలను మోసం చేసిన పార్టీలను శిక్షించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘంపైనే ఉన్నదని చెప్పామని కేటీఆర్ వెల్లడించారు. ‘ఎన్నికల సమయాల్లో పార్టీలు ఇచ్చే హామీలు, అడ్డగోలు వాగ్ధ్దానాలపై ఈసీకి వివరించాం. తెలంగాణను ఉదాహరణగా తీసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చింది. నోటికొచ్చిన మాటలు చెప్పి, ఒక అర్రాస్ పాటలాగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించింది. ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి ఓట్లు సంపాదించింది. మా కంటే 1.8 శాతం ఓట్లు ఎక్కువగా తెచ్చుకొని గెలిచింది. 100 రోజుల్లోనే హామీ లు అన్ని అమలుచేస్తామని స్టాంప్ పేపర్లు ముద్రించింది.
అఫిడవిట్లు కూడా తయారుచేసి వంచించింది. చివరికి గుడిలో దేవుడి మీద బాండు పేపర్లు పెట్టి కూడా ప్రమాణం చేసింది. రాష్ట్రంలోని సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేశారో సవివరంగా ఎన్నికల సంఘానికి వివరించాం. ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టోకు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే వాటిని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీదనే ఉన్నది. ఎన్నికల్లో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అవసరమైతే వారి సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. వారిని అనర్హులుగా ప్రకటించాలి. మళ్లీ ఎన్నికల్లో పాల్గొనకుండా చూడాలి’ అని ఈసీని కోరినట్టు కేటీఆర్ చెప్పారు.
ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావడానికి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈసీకి సూచించినట్టు కేటీఆర్ చెప్పారు. ఎన్నికల్లో ఖర్చు, ప్రలోభాలు దొంగ హామీలు, ప్రజలను వంచిస్తున్న అంశాలపై లోతుగా చర్చించాం. చాలా విషయాలను మా పార్టీ తరఫున లిఖితపూర్వకంగా అందజేశాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీ వేయాలని కోరాం. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై కూడా లోతుగా చర్చించాం. 65 లక్షల మంది ఓట్లు పోయాయని చెప్తున్నరు. ఎందుచేత ఇలా జరుగుతున్నదని ఈసీని అడగ్గా, చనిపోయినవారి ఓట్లు తీసేశాం. ఎవరైనా మైగ్రేట్ అయితే తీసేశాం. ఎవరైనా స్పందించకపోతే తీసేశాం. ట్రేస్ చేయకపోతే తీసేశాం.. తప్ప ఇబ్బంది లేదని చెప్పారు. రివిజన్ చేయాలని, అందరి విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ తరఫున సూచించాం’ అని సూచించారు.
కారు గుర్తును పోలిన సింబల్స్‌ను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఈసీకి వివరించినట్టు కేటీఆర్ చెప్పారు. ‘కారు గుర్తును పోలిన 8, 9 సింబల్స్‌ను తొలగించాలని ఎన్నో ఏండ్ల్లుగా పోరాడుతున్నాం. 2019 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ సీటు ఐదువేల ఓట్లతో ఓడిపోయాం. ఒక స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన రోడ్ రోలర్ గుర్తు వల్ల మేం ఓడిపోయాం. ఒక్కసారి కాదు అనేక సందర్భాల్లో నష్టం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు మాపై నుంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తామని కూడా చెప్పాం.
ఈసీ అన్ని రాష్ర్టాల్లోనూ పర్యటించాలి. ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రజాసంఘాలతో, ఎన్జీవోలతో చర్చించి వారి అభిప్రాయం తీసుకోవాలని సూచించాం. మేము చెప్పిన అన్ని అంశాలను సావధానంగా విన్నారు. ఇదే మొదటిసారి కాదు మళీ ్లమళ్లీ రండి మీ అభిప్రాయాలు చెప్పండి అని ఈసీ సూచించారు. మా ఎంపీలు వస్తారు అని చెప్పాం’ అని కేటీఆర్ తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలో కాంగ్రెస్ డ్రామాలుచేస్తే ఎవరూ నమ్మరు. బడ్జెట్లో బీసీలకు 20 వేల కోట్లు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ అన్నారు. రిజర్వేషన్లు అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం, విద్యా, ఉద్యోగ, ఉపాధిలో ఇచ్చారా? ఇవి మీ చేతుల్లోనే ఉన్నాయిగా. ఎందుకివ్వరు?
-కేటీఆర్
బీసీలకు కాంగ్రెస్ ధోకా
కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం, దగా చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలో కాంగ్రెస్ డ్రామాలు చేస్తే ఎవరూ నమ్మరని అన్నారు. బీసీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లో ఉన్న పనులు ముందు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ‘20 వేల కోట్లు బడ్జెట్లో బీసీలకు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ అన్నారు. రిజర్వేషన్లు అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం, విద్యా, ఉద్యోగ, ఉపాధిలో ఇచ్చారా? ఇవి మీ చేతుల్లోనే ఉన్నాయిగా, ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు? సబ్‌ప్లాన్ ఎందుకు పెట్టరు? మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి. దొంగ నాటకాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ ప్రజలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని కేటీఆర్ హెచ్చరించారు.
ఈ రోజు అమెరికా, యూకే, జర్మనీ, ఇటలీ సహా అనేక దేశాలు కొంతకాలం వరకు ఈవీఎంలను ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పటికీ వాటిపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది. దీంతో ఈవీఎంలను రద్దు చేసి మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
-కేటీఆర్
కాళేశ్వరం నివేదిక మొత్తం గ్యాస్, ట్రాషేనని కేటీఆర్ మండిపడ్డారు. ‘మొత్తం 650 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించడంలోనే వారి బాగోతం అర్థమైంది. అంటే 600 పేజీలు వారికి ఇష్టం లేనివి ఉన్నాయి. 60 పేజీలు వారికి ఇష్టమున్నయి ఉన్నయ్. కాబట్టి వాటిని చూపించే ప్రయత్నం చేశారు. రిపోర్టు ఇచ్చింది సాయంత్రం.. అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు. ఆయన పాపాల భైరవుడు, ఈయన పాపాల భైరవుడు.. అని రోత వార్తలు, ఉద్దేశపూర్వకం కాకపోతే 650 పేజీలు ఎవరూ చదవకముందే ఆ రెండు పత్రికలకు విషయాలు ఎలా తెలిశాయి.
ఎలా విషం వండి వర్చినయ్. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద కుట్రచేసే ప్రయత్నం. ఆ నివేదికలో గ్యాస్, ట్రాష్ తప్ప ఏమీ లేదు. దమ్ముంటే మొత్తం 650 పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి. అసెంబ్లీలో పెడతా అంటున్నారు కదా. అక్కడ చర్చిద్దాం. ఈ రోజు హరీశ్‌రావు చాలా వివరంగా చెప్పారు. అసెంబ్లీలో మైక్‌కట్ చేయకండి.. అసెంబ్లీలో చీల్చి చెండాడి.. ఫుట్‌బాల్ ఆడకపోతే మమ్మల్ని అడగండి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.