గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉన్నది కాంగ్రెస్ వాళ్ల పరిస్థితి! క్యాబినెట్ సమావేశంలో పర్సెంటేజీలు పంచుకోవడం, పంచాయితీలు పెట్టుకోవడం నిజం కాదా? మంత్రి వర్గం మొత్తం ఆరు గ్రూపులైంది. అందినకాడికి దోచుకునుడు, అందరూ కలిసి పంచుకునుడు, ఇదే కదా చేస్తున్నది? ముమ్మాటికీ మీది దండుపాళ్యం బ్యాచే. అన్ని వర్గాల ప్రజలు మిమ్మల్ని ఛీకొడుతున్నరు.
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 25 : ‘ముమ్మాటికీ మీది దండుపాళ్యం బ్యాచే. మీది అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజలు ఛీకొడుతున్నరు’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలో మాజీ మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సిద్దిపేటకు వచ్చి నిజాలు చెప్తానని, అన్నీ అబద్ధ్దాలు మాట్లాడారని విమర్శించారు. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు కాంగ్రెస్ వాళ్ల పరిస్థితి ఉన్నదని ఎద్దేవా చేశారు. క్యాబినేట్ సమావేశంలో పర్సంటేజీలు పంచుకోవడం, పంచాయితీలు పెట్టుకోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మంత్రి వర్గం మొత్తం ఆరు గ్రూపులైందని ధ్వజమెత్తారు. అందినకాడికి దోచుకునుడు, అందరు కలిసి పంచుకునుడు, ఇదే కదా చేస్తున్నదని మండిపడ్డారు.
కమీషన్లు, వాటాలు, కాంట్రాక్ట్‌ల కోసం మంత్రులు కొట్లాడుతున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ‘జరిగిన రాద్ధాంతాన్ని ‘మీ మంత్రి కుటుంబ సభ్యులు బయట పెట్టలేదా? ఏకంగా ముఖ్యమంత్రే గన్ పంపారని చెప్పలేదా? అని అడిగారు. జరిగిన విషయాన్ని మొత్తం తెలంగాణ సమాజం చూసిందని తెలిపారు. గన్ కల్చర్ తెచ్చింది ముఖ్యమంత్రేనని ఓ మంత్రి కుటుంబం స్పష్టం చేస్తున్నదని, ఇంకో మంత్రి టార్చర్ చేయడం వల్ల ఏకంగా ఓ ఐఏఎస్ పారిపోయిండని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం.. తన వాటా తనకు వస్తే చాలు, ఏమైతే తనకేంది అన్నట్టుగా ఉన్నారని విమర్శించారు. అన్ని ప్రధాన పత్రికలు క్యాబినేట్లో మంత్రుల పంచాయితీల గురించి రాయలేదా? అని అడిగారు. పర్సనల్ పంచాయితీలు పెట్టుకోవడానికి క్యాబినేట్ మీటింగ్ ఎందుకు? పార్టీ మీటింగ్ పెట్టుకోవచ్చు కదా? అని దుయ్యబట్టారు.
అంబేద్కర్ విగ్రహం వద్దకు రండి..
హరీశ్‌రావు చేపట్టిన అభివృద్ధి, కాంగ్రెస్ సర్కార్ పాలన తీరు, మంత్రుల వ్యవహారంపై చర్చించేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తాను ప్రతి సవాల్ విసురుతున్నట్టు చెప్పారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
‘నువ్వు, మీ ముఖ్యమంత్రి
చర్చకు రావాలి’ అని ప్రతిసవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీశ్‌రావును ఇక్కడ డిస్ట్రబ్ చేసేందుకే ముఖ్యమంత్రి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను సిద్దిపేటకు పంపించారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ఓటమి ఎరుగని నాయకుడు హరీశ్‌రావు మీద మాట్లాడటం సరికాదని సూచించారు. మంత్రి లక్ష్మణ్ లాంటి వాళ్లను చూస్తే సిగ్గనిపిస్తున్నదని అన్నారు. దున్నపోతు అని సహచర మంత్రి అన్నా ఇంకా ఆ మంత్రి పదవిలో ఎందుకు కొనసాగుతున్నావని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి రిజ్వీ మీద సీఎంకు ఐదుసార్లు లేఖ రాస్తే పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సఖ్యత లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అడ్లూరి వైఖరి మార్చుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.