హుస్నాబాద్, ఏప్రిల్ 13: అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ ఆరోపించారు. అబద్ధాల పునాదులపై అధికారం చేపట్టిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని శుభం గార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి విద్యార్థి, యువజన చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రజల సమస్యలకు ఢిల్లీలో పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యమవుతుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు అధిష్ఠానం అడుగులకు మడుగులొత్తుడు తప్ప తెలంగాణ సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించే అవకాశం ఉండదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ తాకట్టుపెట్టి పదవులు అనుభవిస్తున్నారు తప్ప ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం లేదని విమర్శించారు.
ఎంపీగా కరీంనగర్‌కు బండి సంజయ్ చేసిందేమీ లేదని, కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ తానే తెచ్చినట్లు అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి తనను భారీ మెజార్టీతో గెలిపించడంలో యువత, విద్యార్థులు ముందుండి పనిచేయాలని పిలుపునిచ్చారు.తాను ఎంపీగా గెలిస్తే హుస్నాబాద్ నియోజకవర్గంలోని యువత, విద్యార్థుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, రాజకీయ విశ్లేషకులు వీ ప్రకాశ్, నాయకులు కర్ర శ్రీహరి, దరువు ఎల్లన్న పాల్గొన్నారు.