BRS | దేశ నలుమూలలకు బీఆర్ఎస్ విస్తరిస్తున్నది. ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్’ అంటూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నినాదం ప్రకంపనలు సృష్టిస్తున్నది. రెండున్నర నెలల స్వల్ప వ్యవధిలోనే మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ మూడుచోట్ల నిర్వహించిన బీఆర్ఎస్ సభలకు జనం పోటెత్తారు. నాందేడ్‌లో నిర్వహించిన మొదటి సభతోనే మహారాష్ట్ర ప్రభుత్వం రైతులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పీఎం కిసాన్ పథకానికి అదనంగా రైతులకు ఎకరానికి మరో రూ.6 వేలు ఇస్తామని ప్రకటించింది. దీంతో మహారాష్ట్ర రైతుల్లో బీఆర్ఎస్ పట్ల, సీఎం కేసీఆర్ విధానాల పట్ల మరింత ఆసక్తి, ధీమా పెరిగింది.
‘కేసీఆర్ మీకు ఇక్కడేం పని. మీరు తెలంగాణలో రాజకీయాలు చేయండి’ అంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. కంధార్లోహా సభలో ఆయన ఏకంగా ఫడ్నవీస్‌కు సవాల్ విసిరారు. ‘అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్న చందంగా మహారాష్ట్రలో సజీవ జలధారలు కురిపించే నదులున్నా… రైతులకు నీళ్లెందుకు ఇవ్వరు? దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే ఎందుకు జరుగుతున్నాయి? మహారాష్ట్ర రైతుల డిమాండ్లు తీర్చేదాకా మహారాష్ట్ర వస్తూనే ఉంటా’ అని సీఎం కేసీఆర్ దీటుగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. రైతులు, సామాన్య ప్రజల్లో కేసీఆర్ పట్ల ఆదరణ పెరుగుతున్నది. ఈ ఆదరణ అన్ని వర్గాలకు శరవేగంగా విస్తరిస్తున్నది.
మహారాష్ట్రలోనూ తెలంగాణ మాడల్ అమలు చేసి తీరాల్సిందేనని రైతులు, దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానాబాద్ జిల్లా ఉమర్గా తాలూకా కౌటా గ్రామంలో ప్రముఖ గాంధేయవాది, సామాజికవేత్త వినాయక్‌రావ్ పాటిల్ తెలంగాణలో మాదిరిగా రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్, సాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్షకు దిగడం పెనుప్రకంపనలు సృష్టించింది. దీక్ష ఐదో రోజుకు చేరగానే మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చింది. ఆయనతో చర్చలు జరిపింది. డిమాండ్ల పరిశీలనకు ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఈ పరిణామాలతో మహారాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నది.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న కోరిక పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే ఔరంగాబాద్, నాగ్‌పూర్, పుణె, ముంబై సహా ఆరుచోట్ల బీఆర్ఎస్ పార్టీకి శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యనేతలు పార్టీ శాశ్వత కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 21న గుంటూరులో ప్రారంభించనున్నారు. కార్యక్రమాల విస్తృతికి పార్టీ కార్యాలయం ఎంతో దోహదపడుతుందని, సాధ్యమైనంత వరకు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటంతో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 11.35 గంటలకు గుంటూరు మంగళగిరి రోడ్డులోని ఏఎస్ ఫంక్షన్‌హాల్ సమీపంలో గులాబీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఒడిశాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమంగోతో పాటు పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో కనీసం మూడు నాలుగు చోట్ల పార్టీ కార్యాలయాలు ప్రారంభించి వాటి కేంద్రంగా బీఆర్ఎస్ విధానాన్ని, తెలంగాణ మాడల్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే యోచనలో గిరిధర్ గొమంగో ఉన్నారు.
మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా ఇలా వివిధ రాష్ర్టాల్లో ఏర్పాటు చేసే కార్యాలయాలను ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయంతో అనుసంధానం చేయనున్నారు. ఇతర రాష్ర్టాల్లో సభ్యత్వ నమోదు, ఆయా రాష్ర్టాల్లో పార్టీ బాధ్యులు, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు సహా సమస్త పార్టీ క్యాడర్ వివరాలు (మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వగైరా) కంప్యూటరీకరించే దిశగా చర్యలు చేపట్టారు.