హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): బీఏసీ సమావేశం జరిగిన తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు? సభ ముందుకు ఏయే అంశాలు తెస్తారు? బిల్లులు ఏమిటి? వంటి అంశాలపై ఎటూ తేల్చకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సీపీఐ నుంచి సాంబశివరావు హాజరయ్యారు. ప్రజల సమస్యలపై, ప్రత్యేకించి లగచర్ల అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహించిన బీఆర్ఎస్ సమావేశం నుంచి వాకౌట్ చేయగా, ఎంఐఎం కూడావాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించింది.
సభా సంప్రదాయాలు పాటించరా?: హరీశ్
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై హరీశ్ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశాలను కనీసం 15 రోజులైనా నిర్వహించాలని పట్టుబట్టారు. ‘పుట్టినరోజునాడు సభ పెడ్తారు. పెండిండ్లకు పోతే సమావేశాలకు సెలవులు ఇస్తారా?’ అని నిలదీశారు. బీఏసీ అంటే ‘బిసట్ అండ్ చాయ్’ సమావేశం కాదంటూ వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సభా సంప్రదాయాలకు భిన్నంగా సభను నడపాలని ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తుండటం దుర్మార్గమని పేర్కొన్నారు.
రాహుల్‌కో నీతి… మాకో నీతా?
అదానీ స్టిక్కర్లు అంటించుకొని, మాస్క్‌లు ధరించి పార్లమెంట్‌లోకి రాహుల్ ప్రవేశిస్తే ఒప్పు అయినప్పుడు, తాము అనుసరించిన వైఖరీ సరైందేనని హరీశ్‌రావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ సభ్యులు టీషర్టులతో వస్తే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రొటోకాల్ ఉల్లంఘనలు దారుణం
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కాదని కాంగ్రెస్ నాయకులను వేదికల మీద కూర్చొపెడుతూ ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని హరీశ్‌రావు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం నిర్వహించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.
విధాన నిర్ణయాలు బయట ప్రకటిస్తారా?
శాసనసభ సమావేశాలు జరుగుతుండగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కౌలు రైతులకు రూ.12 వేలు ఇవ్వబోతున్నామని బయట ప్రకటన చేయడంపై హరీశ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. బీఏసీ చెప్పినట్టే సభ నడవాలని స్పష్టంచేశారు. సమావేశాల్లో ప్రతిరోజూ జీరో అవర్ ఉండాలని సూచించారు. ఇంకా మిగిలిన హౌజ్కమిటీలను నియమించాలని కోరారు.
చర్చించకుండానే ఎజెండా ఖరారా?: కౌశిక్‌రెడ్డి
బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఖరారు చేయడం దారుణమని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి విమర్శించారు. అప్రాధాన్య అంశాలను ఎజెండాలో చేర్చడాన్ని తప్పుబట్టారు. ‘ఇప్పుడు చర్చించాల్సింది టూరిజంపై కాదు.. లగచర్ల టెర్రర్‌పై’ అని పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఏ తప్పు చేశారని లగచర్ల రైతులను నెలరోజుల నుంచి జైల్లో పెట్టారని ప్రశ్నించారు. గుండెపోటుకు గురైన రైతు హీర్యానాయక్‌కు బేడీలు వేసి నడిపించుకుంటూ దవాఖానకు తీసుకొనిరావడం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరినీ అవమానించిందని దుయ్యబట్టారు.