Lagacharla | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఎటు నుంచి అధికారులు వచ్చి ఎవరి పొలంలో టేపులు పట్టి కొలుస్తరో… ఏ రోజు కాంగ్రెస్ నాయకులు వచ్చి మీ భూములియ్యాల్సిందే.. ఇయ్యకుంటే గుంజుకుంటమని బెదిరిస్తరో… ఏ అద్దమరాత్రి పోలీసులు వచ్చి తమ ఇంట్లో నిద్రపోతున్న మగవారిని చేతులు విరిచి ఈడ్చుకుపోతరో.. అడ్డుకున్న ఆడవాళ్లపై అసభ్యంగా ప్రవర్తిస్తరో.. ఇలా ఒకట్రెండు రోజులు కాదు! ఏడాది దాటిన కాంగ్రెస్ పాలనలో ఏ రోజు చూసినా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల పరిధిలోని గిరిజన తండాల్లో ఇదే పరిస్థితి. తమ భూములను కాపాడుకునేందుకు గిరిజనులు సాగించిన ‘లగచర్ల లడాయి’ జాతీయ స్థాయిలో సంచలనమైంది. ఒకవైపు ప్రభుత్వం వేధింపులకు గురి చేసినా… బీఆర్ఎస్ అండతో పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నవ్వడమే మరిచిపోయినట్టుగా ఉన్న ఆ గిరిపుత్రులు చాలాకాలానికి సంతోషంగా గడిపారు. సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హకీంపేటకు వచ్చిన సందర్భంగా తండాల్లో పండుగ వాతావరణంలో కనిపించింది. ఈ నవ్వుల వెనుక ఏడాదిగా అనుభవించిన కష్టాలు, వాటిని అధిగమించేందుకు గిరిజనులు సాగించిన పోరాటం కండ్ల ముందు కదలాడుతాయి.
తండాలపై ఫార్మా పిడుగు
ఫార్మా కంపెనీల కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలోని భూములను సేకరించేందుకు సిద్ధమవడంతో గ్రామాల్లో అగ్గిరాజుకుంది. ప్రధానంగా తండాల్లో ఎకరం, రెండెకరాల కొద్దిపాటి భూమి సాగుచేసుకుంటూ బ్రతుకుతున్న గిరిజనులు తమ భూములు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఏడాది కాలంగా లగచర్ల పరిధిలోని రోటిబండతండా, పులిచర్లకుంటతండాల్లోని వందలాది ఎకరాల భూములను కాపాడుకునేందుకు గిరిజనులు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. నిత్యం తండాలకు వచ్చే అధికారులు వేధింపులకు గురిచేశారు. తాము భూములు ఇవ్వబోమంటూ హైదరాబాద్, వికారాబాద్, దుద్యాలలోని సర్కారు ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఇలా ఎక్కని గడప లేదు.. దిగని గడపలేదు అన్నట్టుగా అర్జీలు పట్టుకుని తిరిగారు. కనిపించిన ప్రతీఅధికారి కాళ్లావేళ్లా పడ్డారు. అయినా ఎవరూ కనికరించలేదు. సర్కారు నిర్దాక్షిణ్యంగా భూములను లాక్కునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కలెక్టర్, జిల్లా అధికారులు గ్రామసభలు పెట్టి భూములు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగించారు. నవంబర్ చివరివారంలో కొందరు గిరిజనులు అధికారులపై దాడి చేశారంటూ పోలీసులు కేసుపెట్టారు. ఇదే అదనుగా అర్ధరాత్రి గ్రామాలపై విరుచుకుపడ్డ వందలాది మంది పోలీసులు కరెంటు తీసి ఇండ్లలోకి చొచ్చుకెళ్లారు. నిద్రిస్తున్న ప్రతి మగవారిని రెక్కలు విరిచి ఈడ్చుకుపోయారు. ఇలా 60 మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, 25 మందిపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపారు.
దుఃఖంలో తండాలు.. దీనంగా జైలుపక్షులు
పోలీసులు గ్రామాలపై విరుచుకుపడ్డప్పుడు చిన్నాపెద్దా, ముసలీముతక చూడలేదు. దాడి జరిగిందని చెప్తున్న రోజు ఆ వ్యక్తులు ఊర్లో ఊన్నారో లేరో అని కూడా పోలీసులు అడగలేదు…. గిరిజనులు చెప్పినా పోలీసులు వినలేదు. కఠినమైన సెక్షన్లు పెట్టి అరెస్టు చేయడంతో 70 రోజుల పాటు వరకు అమాయక గిరిజనులు జైలు జీవితం గడిపారు. కొడంగల్ మాజీఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా గిరిజనులు పోరాటం ఆపలేదు. బీఆర్ఎస్ అండతో వీరోచితంగా ధైర్యసాహసాలు ప్రదర్శించారు. జైలుపాలైన తమ వారిని రక్షించుకునేందుకు గిరిజన మహిళలు చేసిన ఉద్యమం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆందోళనల నుంచి న్యాయపోరాటం వరకు, కొడంగల్‌లో సాగుతున్న అకృత్యాలను ఢిల్లీ స్థాయిలో ఎండగట్టడం వరకు బీఆర్ఎస్ వెన్నంటి నిలిచింది. జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ముఖ్యనేతలు, మహిళానేతలు ప్రత్యక్షంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. పోరాటం ఫలించి రైతులంతా జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చారు.
రామన్న రాకతో తండాల్లో పండుగ
ఇలా 2024 జనవరిలో మొదలైన భూపోరాటం కొనసాగుతూనే ఉంది. తండాల్లోని పండుగ పబ్బం లేకుండా పోయింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూసేకరణకు సర్వే చేస్తున్నా గిరిజనులను వేధింపులకు గురి చేసేందుకు సాహసించడంలేదు. కొన్నిరోజులుగా గిరిజనులంతా కాస్త కుదుటపడి, తిరిగి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం కోస్గిలో రైతు దీక్ష సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుంకిమెట్లతో పాటు హకీంపేటకు కూడా వెళ్లారు. కేటీఆర్ వస్తున్నారని రెండు తండాలకు చెందిన గిరిజనులు హకీంపేటకు వచ్చి, ఘనస్వాగతం పలికారు. ఏడాదిగా ఆ ప్రాంతంలో ఇంత సందడి నెలకొనడం ఇదే మొదటిసారి అని స్థానికులు ఆనందభాష్పాలతో చెప్పారు. ముఖ్యంగా గిరిజన మహిళలు తమ సంప్రదాయ నృత్యాలతో ఆడి, పాడి సందడి చేయడంతో లగచర్ల పరిధిలో పండుగ వాతావరణం కనిపించింది.
సీఎంపై విద్యార్థినుల ఆగ్రహజ్వాల
‘మా భూముల జోలికి వస్తే సహించేది లేదు. ఎక్కడో ఉండి కాదు ఇక్కడికి వచ్చి మా మధ్యలో ఉండి భూములు కావాలని అడుగు. మేము ఇస్తామా? లేదా? తెలుస్తది. మీకు ఓట్లేసిన మా బాధలు మీకు కనిపించడం లేదా?’ అంటూ రోటిబండతండాకు చెందిన విద్యార్థిని మంజుల కోస్గి రైతు నిరసన దీక్షలో సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీసింది. కొడంగల్ భూముల్లో తొండలు గుడ్లు కూడా పెడతలేవు అంటూ కామెంట్ చేసిన రేవంత్ గురించి ఈ ఆవేశంగా మాట్లాడింది. ‘ఓట్లేయని వాళ్లొచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. నీవు ఎక్కడున్నావ్ సార్’ అంటూ గట్టిగా నిలదీసింది. మా బాధలు కనిపించడం లేదా? ఏడుస్తూ చెప్పే మాటలు వినబడడం లేదా? మీరు కేసులు వేసినందుకు మా నాన్న ఎక్కడికో పోరిపోయి అడుక్కొని తిన్నాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉంటుందా? అని తండాల బాధను వెళ్లగక్కింది.
చీఫ్ మినిస్టర్ కాదు.. చీప్ మినిస్టర్
‘రేవంత్‌రెడ్డి సార్ ప్రజల బాధలు మీకు కనిపిస్తున్నాయా? మీరు చీఫ్ మినిస్టర్ కాదు.. చీప్ మినిస్టర్‌లా అబద్ధాలకోరు’ అని రోటిబండ తండాకు మరో విద్యార్థిని పూజ ఆగ్రహం వెళ్లగక్కింది. ‘నీ మాటలన్నీ అబద్ధాలే.. మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అని అంటావా. మాకెవరూ డబ్బులియ్యలేదు. మా కష్టం బాధను తెలుసుకున్న మా అన్న కేటీఆర్.. మమ్మల్ని ఆదుకున్నాడు’ అంటూ చెప్పింది. ‘మా పేరెంట్స్ బాధల్ని మేము కండ్లారా చూసినం. మా బాధలు చూసి మాకు సాయం చేసిన కేటీఆర్ హెల్పింగ్ నేచర్ చూసి మాట్లాడుతున్నాం. రేవంత్ సార్ మీకే ఓట్లేసినం.. మీరెప్పుడైనా మా బాధలు గమనించారా?’ అని పూజ తన గుండెలోతుల్లోంచి బాధను వ్యక్తంచేసింది.
కొడంగల్‌ను అవమానిస్తున్న రేవంత్ : నిరంజన్‌రెడ్డి
రాజకీయ భిక్షను ప్రసాదించిన కొడంగల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తొండలు గుడ్లుపెట్టని భూములు అంటూ ఈ రైతులను, గిరిజనులను అవమానించడం సరికాదని రైతు నిరసన దీక్షలో మండిపడ్డారు. మార్పు మార్పు అని ప్రజలను ఏమార్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో పదేండ్లలో ఏటా అద్భుతరీతిలో వ్యవసాయాన్ని తీర్చిదిద్దుకున్నామని చెప్పారు. రైతంటే చెమట చుక్కకు ప్రతిరూపం అన్నట్టు కేసీఆర్ గౌరవించారని తెలిపారు. కష్టానికి విలువ తెచ్చిన, భూమికి విలువలు పెంచిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. పంటలను పెంచి, అదే పంటలను సకాలంలో కొని రైతులకు మేలు చేసిన నాయకుడని చెప్పారు.
రేవంత్‌పై నమ్మకం పోయింది: పట్నం నరేందర్‌రెడ్డి
రేవంత్ సర్కారుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. కోస్గి రైతు నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. ఎట్ల గెలిపించుకున్నామో, అట్లనే ఓడగొడతామని ఈ ప్రాంత రైతులు అంటున్నారని చెప్పారు. జనవరి 26న కోస్గి గడ్డపై రైతుబంధు ఇస్తానని, ఆత్మీయ భరోసా ఇస్తానని, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, రేషన్ కార్డులు ఇస్తామని, పథకాలు అమలు చేసి ఇస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పటికీ ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కంపెనీలను పెడతామంటే లగచర్ల రైతులు సీఎం రేవంత్‌కు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని.. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విసుగు: రాజేందర్‌రెడ్డి
కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తెలిపారు. కోస్గి రైతు నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. దామరగిద్ద మండలంలో సబ్‌స్టేషన్ పేరుతో అక్కడి భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రజలను హింసించే పాలన అని విమర్శించారు.