KGBV | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : ఎందరో నిరుపేద, నిరాశ్రిత బాలికలను అక్కున నేర్చుకున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను(కేజీబీవీల) కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసింది. 15 నెలల పాలనలో ఒక్కటంటే ఒక్క కేజీబీవీని ఇంటర్ వరకు అప్గ్రేడ్చేయలేదు. దీంతో బాల్యవివాహాలకు దారితీస్తున్నది. లేదంటే పైచదువుల కోసం బాలికలు ఇంటర్ చదువులకు ఇతరదారులు వెతుక్కోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 495 కేజీబీవీలున్నాయి. పదో తరగతి వరకు గల ఈ కేజీబీవీలను గత బీఆర్ఎస్ సర్కారు ఇంటర్ వరకు అప్గ్రేడ్చేసింది. దశలవారీగా 283 కేజీబీవీల స్థాయిని పెంచి, బాలికలకు నాణ్యమైన విద్యనందించింది. ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేసిన కేజీబీవీల్లో రెగ్యులర్ కోర్సులతోపాటు వొకేషనల్ విద్యనందించింది. దీంతో కేజీబీవీలపై క్రేజీ వాతావరణం నెలకొన్నది. అయితే మరో 212 కేజీబీవీలను 10వ తరగతి వరకే నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేజీబీవీని కూడా అప్‌గ్రేడ్ చేయలేదు. కేజీబీవీల వాతావరణానికి అలవాటుపడిన బాలికలు పదో తరగతి తర్వాత జూనియర్ కాలేజీల్లో సర్దుబాటుకాలేకపోతున్నారు. డ్రాపౌట్ అవుతున్నారు. ఇక పదో తరగతి పూర్తికాగానే చదువుల భారం భరించలేక కుటుంబసభ్యులు వివాహాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు తీరు బాల్యవివాహాలకు ఆస్కారమిస్తున్నది.
రూ.105కోట్లివ్వండి
కేజీబీవీలను సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా నిర్వహిస్తున్నారు. ఏటా నిర్వహించే ఎస్ఎస్ పీఏబీ సమావేశంలో కేజీబీవీల అప్‌గ్రేడేషన్‌కు ఆమోదం తెలుపుతారు. కానీ 2024-25 విద్యాసంవత్సరంలో ఒక్క కేజీబీవీని కూడా అప్‌గ్రేడ్ చేయలేదు. 2025-26 విద్యాసంవత్సరంలో 30 వరకు కేజీబీవీల అప్‌గ్రేడేషన్ కోసం ప్రతిపాదనలు సమావేశం ముందుంచారు. కానీ ఏదీ తేలలేదు. 212 కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సర్కారుకు ప్రతిపాదనలు పంపించింది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధంలేకుండా రాష్ట్ర ప్రభుత్వమే అప్‌గ్రేడ్‌చేయాలని, ఇందుకు రూ.105 కోట్లు ఖర్చవుతాయని ప్రతిపాదించింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా సమకూర్చాలని కోరింది. ఇందుకు సర్కారు పచ్చ జెండా ఊపుతుందా.. లేక మోకాలడ్డుతుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి.