BRS | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీకి, ప్రత్యర్థి పార్టీలకు వచ్చిన ఓట్లను బేరీజు వేసుకొని అవసరమైన కార్యాచరణ రూపొందించుకుంటున్నది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితిని అంచనావేసి ముందుకు సాగుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 25న చేవెళ్ల ఎంపీ జీ రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్ తదితర ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు.
వచ్చేనెల 3వ తేదీ నుంచి అసెంబ్ల సెగ్మెంట్లవారీగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసి, అందుకు అనుగుణమైన కార్యాచరణను రూపొందిస్తామని వెల్లడించారు. ఇదే సమావేశంలో ఈ సారి చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతారని కేటీఆర్ సూచనప్రాయంగా చెప్పారు. దీంతో ఇప్పటికే కార్యక్షేత్రంలోకి దిగిన రంజిత్‌రెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా ఉంటారని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగైదు రోజుల నుంచే బోయినపల్లి వినోద్‌కుమార్ కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అవుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు, మాజీలు సైతం నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. మండలాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలైనంత మాత్రాన నిరాశచెందాల్సిన పనిలేదని, ఓటమిని పాఠంగా స్వీకరించి గెలుపు కోసం దారులు వేసుకుందామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల ముఖ్యనేతల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. పదేండ్లపాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని, అదృష్టాన్ని ఇస్తే అద్భుతాలు సృష్టించామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, వాటికి అనుబంధంగా ఇచ్చిన హామీలను అమలు చేయించే గురుతర బాధ్యత బీఆర్ఎస్పై ఉన్నదని చెప్పారు. ఒకవేళ అధికార పక్షం చేతులెత్తేస్తే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాల్సిన బాధ్యతకూడా బీఆర్ఎస్పైనే ఉందని పార్టీ భావిస్తున్నది.