హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): ‘బీసీలకు బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లే ఇస్తాం తప్ప తక్కువ ఇవ్వం’ అంటూ ఢాంబికాలు పలికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆఖరికి తుస్సుమనిపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీలకు 23 స్థానాల్లో టికెట్లు ఇవ్వగా కాంగ్రెస్ అంతకంటే ఒకటి తక్కువే ఇచ్చింది. నారాయణఖేడ్‌లో బీసీ బిడ్డ సురేశ్షేట్కార్కు ఇచ్చిన టికెట్‌ను ఆఖరి క్షణంలో రద్దు చేసి దానిని సంజీవరెడ్డికి కట్టబెట్టింది. బీసీలకు కేటాయించిన 22 సీట్లలో సగం సీట్లు ఓడిపోయేవేనని ఆ పార్టీ బీసీ నేతలే పెదవివిరుస్తున్నారు. బీసీలకు టికెట్లు ఇవ్వలేదనే అపవాదు రాకుండా ఉండేందుకు ఆ సీట్లను కట్టబెట్టారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో తమకు పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు టికెట్ల చొప్పున కనీసం 34 సీట్లు కేటాయించాలని పార్టీలోని బీసీ నేతలు డిమాండ్ చేశారు. ఇందుకోసం బీసీ సీనియర్ నేతలు వీహెచ్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్యయ్య, కత్తి వెంకటస్వామి వంటి వారు అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కానీ వారి కోరికను అధిష్ఠానం పట్టించుకోకపోగా, ఢిల్లీ వెళ్లిన బీసీ నేతలను తీవ్రంగా అవమానించింది.