వరంగల్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఉన్నది కాస్త ఊడింది. సర్వమంగళం పాడింది’ అన్నట్టే తయారైంది బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేల దుస్థితి. బీఆర్ఎస్ను వీడితే మటాషే అనే రీతిలో ప్రజలు వారికి బుద్ధిచెప్పారని గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయి. ఫలితాలతో వారి మైండ్‌బ్లాంక్ అయిందని, వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యిందని సన్నిహితులే చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ అండతో ఓ వెలుగువెలిగిన ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పంచాయతీ ఎన్నికల ఫలితాలతో చిమ్మచీకట్లోకి జారిపడ్డారు.
బీఆర్ఎస్లో గెలిచి అది సొంత ఘనత అనుకొని విర్రవీగి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇద్దరు, తరువాత ఒకరు బీజేపీలో చేరారు. జాతీయ ఎజెండా నేపథ్యంగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్కు పార్లమెంట్లో ఒక్కసీటు కూడా రాకపోవడంతో ‘పార్టీ మారి మంచిచేశాం’ అని అప్పుడు సంబురపడిన ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలను ప్రజలు ఇప్పుడు ‘పంచాయతీ’లో ఛీకొట్టారు, పరుగెత్తించారు. దీంతో పార్టీ మారి తప్పు చేశామనే అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నారని జరుగుతున్న పరిణామాలే చెప్తున్నాయి. ‘8 మంది ఎమ్మెల్యేలం, 8 మంది ఎంపీలం ఉ న్నాం., త్వరలో రాష్ట్రంలో అధికారం మాదే..’ అని దంచికొట్టే ఉపన్యాసాల బీజేపీ నేతలకు తెలంగాణ పల్లె కీలెరిగి వాతపెట్టిందనే అభిప్రాయాలు నేడు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ హయాం లో విప్‌గా గు వ్వల బాలరాజు, హౌసింగ్ సొసైటీస్ చైర్మన్‌గా అరూరి రమేశ్, ఎమ్మెల్యే హోదాలో వైభో గం అనుభవించారు. నియోజకవర్గాల్లో వారు చెప్పిందే శాసనం అన్నట్టు చెలాయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీలో చేరారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా సాగించుకున్న హవా ఎంపీలై ఢిల్లీలో వెలుగబెడుతామని భావించి అరూరి రమేశ్, శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరారు.
వరంగల్ లోకసభ బీజేపీ అభ్యర్థిగా అరూరి, నల్లగొండ బీజేపీ అభ్యర్థిగా శానంపూడి పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల తర్వాత అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా బీజేపీలో చేరారు. ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారు ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరాభవం ఎదురైంది. హుజూర్నగర్ నియోజకవర్గంలో అయితే కనీసం ఒక్క సీటు కూడా బీజేపీ గెలుచుకోలేక తోకముడువగా, అచ్చంపేటలో రెండు, వర్ధన్నపేటలో అరూరి రమేశ్ అహోరాత్రులు కష్టపడితే 4 సర్పంచ్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి దుస్థితి.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దివిటీలుగా వెలిగిన మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, గువ్వల బాలరాజు, శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరిన తరువాత వాడిన పూలే అయ్యారని పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిగ్గుతేల్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్లో వారికి వచ్చిన ఓట్లకు, అదే నియోజకవర్గాల్లో ఆ నేతలు బీజేపీలో చేరిన తరువాత వచ్చిన సర్పంచ్ స్థానాలకు మధ్య ఆకాశానికి పాతాళానికి ఉన్నంత వ్యత్యాసమని తేలిపోయింది.

