BRS | హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 19న మధ్యాహ్నం 1 గంట నుంచి హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో ఈ సమావేశం జరగనున్నది. అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలతో విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చ జరగనున్నది.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ, తమ హకులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై చర్చించనున్నట్టు కేటిఆర్ తెలిపారు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులందరూ నిర్దేశిత సమయానికి విధిగా హాజరుకావాలని సూచించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ గురువారం కలిశారు. తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల గురించి తెలిపే పుస్తకంతోపాటు 69 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన నివేదికలను కేసీఆర్‌కు అందజేశారు.