Peddi Sudarshan Reddy | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ధాన్యం టెండర్లలో వేల కోట్లు దోచుకున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ డబ్బు మొత్తం రేవంత్ రెడ్డి కక్కాల్సిందే అని సుదర్శన్ రెడ్డి అన్నారు.
ధాన్యం టెండర్లలో కుంభకోణం జరుగుతుందని బిఆర్ఎస్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని క్యాబినెట్ తేల్చింది. డబ్బులను జప్తు చేయాలని జీఓ నంబర్ 15 విడుదల చేసింది. ధాన్యం టెండర్ల కుంభకోణంపై డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు చేపట్టలేదు. రూ. 66 కోట్లను జప్తు చేయాలని క్యాబినెట్ ఎందుకు తీర్మానం చేసిందో చెప్పాలి అని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం టెండర్ల కుంభకోణంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? తేలు కుట్టిన దొంగల్లా తప్పించుకొని తిరుగుతున్నారు అని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.
ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకు క్యాబినెట్‌కు ఫైల్ వెళ్ళింది. టెండర్ విలువ కంటే రూ. 230 ఎక్కువ వసూలు చేశారు. ధాన్యం టెండర్ల కుంభకోణంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. రూ. 380 కోట్లకు రూ. 66 కోట్లు మాత్రమే జప్తు చేశారు. తప్పించుకోవడం కోసమే రూ. 66 కోట్లు జప్తు చేశారు. టెండర్లు నలుగురు వేస్తే ఇద్దరికి మాత్రమే ఎందుకు పెనాల్టీ వేశారు. మొత్తం డబ్బులు జప్తు చేయకుండా కేవలం రూ. 66 కోట్లు మాత్రమే ఎట్లా చేస్తారు. మొత్తం వ్యవహారంపై జ్యుడీషియరీ విచారణ జరపాలి అని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.