Metuku Anand | వికారాబాద్ : అందాల పోటీలు పెట్టడం కాదు ముందు స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి అని కాంగ్రెస్ నేతలకు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బాలాపూర్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం విచారకరం అని ఆయన పేర్కొన్నారు.
తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో కార్యక్రమంలో పాల్గొన్న సబితా ఇంద్రా రెడ్డి.. ప్రోటోకాల్ పాటించకుండా ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టి, తనకు చోటు లేకపోవడంతో అధికారిక కార్యక్రమంలో ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించినందుకు గాను స్థానిక ఎమ్మెల్యే, అందులోనూ మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కాంగ్రెస్ కార్యకర్తలు సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకురావడం కాంగ్రెస్ పార్టీలో మహిళలకు దక్కుతున్న గౌరవానికి నిదర్శనం అని మెతుకు ఆనంద్ పేర్కొన్నారు.
ఒక ఆడబిడ్డకు ఇంత అవమానం జరుగుతుంటే చూసి చూడనట్టు వ్యవహరించిన బాధ్యతరహిత మంత్రి శ్రీధర్ బాబు అని ఆనంద్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే అని చూడకుండా గతంలో కూడా నిండు సభలో కించపరిచారు. రాజ్యాంగపరమైన నియమాలకు అనుగుణంగా, సబితా ఇంద్రారెడ్డికి పూర్తి భద్రత కల్పించాల్సిన పోలీసులు కాంగ్రెస్ నాయకులకు భయపడి రక్షణ కల్పించలేకపోయారు. ప్రభుత్వం తరపున జరిగే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సైతం గాంధీ భవన్లో జరిగే రాజకీయ కార్యక్రమంలాగా కాంగ్రెస్ పార్టీ మార్చేసిందని ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా దినోత్సవం నాడు మాట్లాడుతూ.. అవకాశం వస్తే ఆడవారు ఏ రంగంలోనైనా రాణిస్తారని, రాజకీయాల్లోకి మహిళలు కూడా రావాలని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ముందు మీరు మహిళలను గౌరవించండి. రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా, టీవీ చర్చా కార్యక్రమాల్లో, మీడియా సమావేశాల్లో మహిళల హుందాతనానికి భంగం కలిగించేలా మీరు వ్యాఖ్యానిస్తుంటే, మీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మిమ్మల్ని అనుసరిస్తూ.. మహిళలను ప్రత్యక్షంగా వేదికలపైన సైతం కించపరుస్తూ శునకానందం పొందుతున్నారు. మీకు దమ్ముంటే, మీది నిజంగానే ప్రజాపాలన అయితే ఎటువంటి పోలీసు బందోబస్తు లేకుండా, ప్రోటోకాల్ పాటిస్తూ కార్యక్రమాలు చెయ్యండి చూద్దాం. పోలీసులు లేకుండా బయట తిరగలేని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాది ప్రజాపాలన అని చెప్పుకోవడం సిగ్గుచేటు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా మీరు, మీ పార్టీ నాయకులు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించడం, వ్యవహరించడం మానేస్తే బాగుంటుంది లేదంటే త్వరలో తెలంగాణ మహిళలు మీకు తగిన బుద్ధి చెబుతారు అని మెతుకు ఆనంద్ హెచ్చరించారు.