ఖమ్మం, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బానోతు మదన్‌లాల్‌కు అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో మదన్‌లాల్ గుండెపోటుతో సోమవారం అర్ధరాత్రి మృతిచెందిన విషయం విదితమే. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మంగళవారం ఖమ్మంలోని స్వగృహానికి తరలించగా బీఆర్ఎస్ నేతలు, నాయకులు సందర్శించి నివాళులర్పించారు. బుధవారం స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాడె మోశారు.
బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు కడసారి చూపు కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, బానోతు హరిప్రియ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేందర్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, డీసీసీబీ మాజీ చైర్మన్ నాగభూషణం, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు నాగరాజు, సుడా మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, తదితరులు మదన్‌లాల్ పార్థివదేహానికి నివాళులర్పించారు.