హైదరాబాద్, మార్చి 28 ( నమస్తే తెలంగాణ ) : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ధూంధాం ప్రదర్శించింది. ప్రతీ సందర్భంలో, ప్రతీరోజు అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పైచేయి సాధించిందని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ డొల్లతనాన్ని నిండుసభలో సమర్థంగా ఎండగట్టిందని విశ్లేషకులు చెప్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, పద్దులపై జరిగిన చర్చలో, చివరకు ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడే సందర్భం వరకు బీఆర్ఎస్ సభ్యులు లోతైన అధ్యయనంతో, సమగ్రమైన వివరాలతో సర్కారు వైఖరిని తూర్పారపట్టారని పలువురు ప్రజాసంఘాల నాయకులు అభినందిస్తున్నారు. కాంగ్రెస్ 15 నెలల పాలన వైఫల్యాలను సమర్థంగా, సమిష్టిగా గులాబీ నేతలు ఎండగట్టారని చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ చెప్తున్న లెక్కలు తప్పని వివరిస్తూ.. గణాంకాలతో బయటపెట్టారు. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, వడ్లకు బోనస్, మహాలక్ష్మి తదితర హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టడంలో బీఆర్ఎస్ విజయం సాధించిందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఓ దశలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బెదిరింపులకు దిగినా, మంత్రులు దబాయించినా వెరవకుండా దీటైనా సమాధానాలతో సర్కారును ఇరుకున పెట్టడంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే స్పీకర్‌నుద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడారంటూ మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని స్పీకర్ సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేశారు. స్పీకర్‌ను బహువచనంతో సంబోధించినప్పటికీ, ఏకవచనంతో సంబోధించారంటూ ప్రభుత్వం అభియోగాలు మోపింది.
సభప్రారంభమైన మొదటిరోజు ప్రధాన ప్రతిపక్ష సభ్యులు సర్కారుపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. కానీ సమాధానాలు చెప్పుకోలేక మంత్రులు నీళ్లు నమిలారంటూ రాజకీయవర్గాలు, సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో మరుసటి రోజు నుంచే క్వశ్చన్ అవర్‌ను రద్దుచేశారు. అలాగే జీరో అవర్‌లోనూ అధికారపక్ష సభ్యులకు మాత్రమే మాట్లాడే అవకాశమిచ్చి చేతులు దులుపుకున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
గవర్నర్ ప్రసంగంలో అప్పులు, ఆరు గ్యారెంటీల అమలుపై చెప్పిన లెక్కల్లో తప్పులు ఉన్నాయంటూ బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిన అప్పులు కేవలం రూ.4.17 లక్షల కోట్లేనని గణంకాలతో వివరించారు. పదే పదే మంత్రులు పాయింట్ ఆఫ్ ఆర్డర్లు అంటూ లేచి అవాంతరం కలిగించినా, అసందర్భంగా చేసిన అనుచిత విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టారు. బీసీ బిల్లులోని లోపాలను ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కేపీ వివేకానంద సమర్థంగా వివరించారని బీఆర్ఎస్ అభిమానుల్లో హర్షం వ్యక్తమయింది. ఫోర్త్‌సిటీకి భూసేకరణ పేరిట దారుణాలు, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ విఫలమైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారపక్షాన్ని నిలదీశారు. రుణమాఫీపై కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని నిప్పులుచెరిగారు.
ఆర్అండ్బీ శాఖ పద్దుపై జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహంగా స్పందించిన తీరు అసెంబ్లీలో ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ పాలనలో రోడ్లకు రిపేర్లు మాత్రమే చేశారని, కొత్త రోడ్లు నిర్మించలేదంటూ కోమటిరెడ్డి అన్నారు. వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రశాంత్‌రెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన రహదారులు, ఖర్చు చేసిన నిధుల వివరాలను లెక్కలు సహా వివరించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. వర్సిటీలకు వీసీల నియామకంపై ప్రభుత్వం చెప్పిన సమాచారంలో తప్పిదాలను తిప్పికొట్టారు. గ్రామీణాభివృద్ధిపై సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో చేసిన పనులను ప్రస్తావించారు. కాంగ్రెస్ సభ్యులతో పాటు స్పీకర్ అడ్డుతగలడంపై బీఆర్ఎస్ నిరసన తెలిపింది. ఎస్సీ వర్గీకరణలోని లోపాలను సరిదిద్దాలని మాణిక్‌రావు కోరారు. దళితబంధు లబ్ధిదారులకు రెండో విడుత నిధులు విడుదల చేయాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైద్య రంగంపై సంజయ్ ప్రసంగానికి మిగిలిన పార్టీల సభ్యులు కూడా అభినందించారు. ఇలా బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్‌ను ఎండగట్టడంలో సఫలీకృతమైందని గులాబీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది.
బడ్జెట్ సమావేశాల చివరిరోజున సభలో వాడీవేడి చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై కేటీఆర్, రేవంత్ మధ్య మాటల యుద్ధం నడిచింది. రేవంత్ వ్యక్తిగత దూషణలకు దిగగా, కేటీఆర్ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ బెదిరింపులకు భయపడేది లేదంటూ బదులిచ్చారు. ఏం చేస్తావో చేస్కో, ఏం చేసినా ఫరక్ పడదంటూ సవాలు విసరడంతో బీఆర్ఎస్ సభ్యుల హర్షాతిరేకాలతో సభ హోరెత్తింది. ఏ ఊరిలోనైనా రైతులందరికీ రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ తేల్చిచెప్పారు. దీనికి అధికారపక్షం నుంచి స్పందన కరువైంది. సీఎం రేవంత్, మంత్రి భట్టి అప్పుల లెక్కలను హరీశ్‌రావు కాగ్ రిపోర్ట్‌ను చూపుతూ నిలదీశారు. దీంతో ముఖ్యమంత్రి, మంత్రి నుంచి భిన్నమైన సమాధానాలు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇలా ప్రజాక్షేత్రంలోనే కాదు సభలోనూ ప్రజల గొంతుకను వినిపించడంలో బీఆర్ఎస్ విజయవంతమైనట్టు అభిమానుల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది.