హైదరాబాద్ : తెలంగాణ రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ విధానాన్ని బలహీన పరిచే , రద్దు చేసే ఏ ప్రయత్నాన్నైనా బీఆర్ఎస్( BRS ) నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తుందని బృందం సభ్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రైతు డిస్కం ( Farmer DISCOM ) ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తు,ఈ ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వరాదని డిమాండ్ చేసింది.
శుక్రవారం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌కు డిస్టిబ్యూషన్ లైసెన్స్ మంజూరు కోసం దాఖలు చేసిన దరఖాస్తుపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అన్ని రాజకీయ పక్షాలతో అభిప్రాయ సేకరణను చేపట్టింది.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ),జగదీశ్ రెడ్డి ( Jagadish Reddy) ,మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ ( Lingaiah Yadav ) , రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి పాల్గొని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ మండలి చైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు.
రైతుల పేరిట ప్రవేశపెట్టే ఏ సంస్కరణ పథకం, పునర్వ్యవస్థీకరణ, సంస్థాగత మార్పులు ఏవైనా రైతులకు స్పష్టమైన ప్రయోజనాన్ని చేకూర్చేలా ఉండాలని సూచించారు. దురదృష్టవశాత్తు వ్యవసాయంపై మాత్రమే దృష్టి సారించే ప్రత్యేక డిస్కంను ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ రైతులకు ఏ నిర్దిష్ట ప్రయోజనం కలుగుతుందో వివరించడంలో ప్రస్తుత ప్రతిపాదన విఫలమైందని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం స్పష్టమైన సంక్షేమ లక్ష్యాలతో రైతు కేంద్రకమైన అనేక చారిత్రాత్మక కార్యక్రమాలను అమలు చేసిందని గుర్తు చేశారు. రైతుబంధు ద్వారా రైతులకు నేరుగా పెట్టుబడి సాయం అందించామని, రైతు బీమా ద్వారా వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించామని, ఉచిత విద్యుత్‌ను అందించామని స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం రైతు డిస్కం ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. ప్రస్తుత ఉన్న సమీకృత వ్యవస్థలో లేని అదనపు ప్రయోజనం ఈ కొత్త సంస్థ ద్వారా ఏమొస్తుందో అటు రైతులకు గానీ ఇటు విద్యుత్ వినియోగదారులకు గానీ అర్థం కావడం లేదని విమర్శించారు. భారత దేశంలో ఏ రాష్ట్రం కూడా కేవలం వ్యవసాయ వినియోగదారుల కోసం ప్రత్యేక డిస్కంను ఏర్పాటు చేయలేదని వెల్లడించారు.
ఇప్పటికీ రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణ విద్యుత్ రంగాన్ని ప్రమాదకరమైన పునర్వ్యవస్థీకరణ ప్రయోగానికి గురిచేస్తున్నారని, రైతు డిస్కం ప్రతిపాదన వెనుక ఉన్న నిజమైన ఉద్దేశంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు డిస్కం నిజం అయితే మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, మున్సిపల్ నీటి సరఫరా వ్యవస్థలను కూడా ఒకే సంస్థ పరిధిలోకి ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు.