హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తేతెలంగాణ): ‘కేసీఆర్, ఆయన కుటుంబంపై అక్కసుతోనే సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అస్థిత్వం పై దాడి చేస్తున్నరు.. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చే కుయుక్తులు చేస్తున్నరు.. విగ్రహ స్వరూపాన్ని మార్చితే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకునేది లేదు’ అంటూ బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి దా సోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ అనేక మంది మేధావు లు, ఉద్యమకారులతో చర్చించి రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు రేవంత్‌రెడ్డి దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు మరి చి, ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టి, కేసీఆర్ చరిత్రను చెరిపే కుట్రలపైనే దృష్టిపెట్టారని దుయ్యబట్టారు. ఆంధ్రా పాలకుల మెప్పు కోసమే తెలంగాణ ఆస్థిత్వ చిహ్నాల్లో మార్పులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం తెలంగాణ భవన్లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌తో కలిసి దాసోజు విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రోద్యమంలో గాంధీ రూపొందించిన చరఖా, రాట్నం తరహాలోనే ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లేందుకు కేసీఆర్ తెలంగాణ తల్లి, బతుకమ్మ, ధూంధాంకు రూపకల్పన చేశారని గుర్తుచేశారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంపై పెట్టిన అశోక చిహ్నంలోని సింహాల రూపాల్లో మార్పులు చేసిన ప్రధాని మోడీని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, సోనియా తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని రేవంత్ మర్చిపోవడం విడ్డూరమన్నారు. ఆయన రాహుల్ పాట పాడుతూ మోడీ బాటలో నడుస్తున్నారని శ్రవణ్ ఎద్దేవా చేశారు. మేధావులు, కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి వికృత చేష్టలపై స్పందించాలని కోరారు.
మీకు కిరీటం ఉండాలె..తెలంగాణ తల్లికి వద్దా?
‘సీఎం రేవంత్ పేరు చివర రెడ్డి అనే కిరీటం ఉండాలి.. కానీ తెలంగాణ తల్లి తలపై కిరీటం ఉండద్దా? రాచరికపు పోకడల పేరిట కిరీటాన్ని తొలగించేందుకు ఆరాటపడుతున్న నువ్వు.. మరి రాష్ట్రంలోని వేలాది మంది దేవుళ్లపై ఉండే కిరీటాలను తొలగిస్తావా? ప్రతిపల్లెలో ఉన్న వేలాది తెలంగాణ విగ్రహాలను ధ్వంసం చేస్తావా?’ అంటూ దాసోజు ప్రశ్నలు సంధించారు. చరిత్ర ఆనవాళ్లతో ఆటలాడితే నిప్పుతో చెలాగాటమాడినట్టేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, సీఎంగా ఎన్నాళ్లు ఉంటా డో తెలియని రేవంత్..ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. లగచర్లలో ఫార్మా కంపెనీ భూ సేకరణ రద్దు చేసిన ముఖ్యమంత్రి, మరీ ఈ ఘటనలో బాధితులు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డిపై కేసులు ఎత్తివేయడంలేదెందుకని ప్రశ్నించారు.
పొన్నంను అడ్డంపెట్టుకొని మోసం: భిక్షమయ్యగౌడ్
ఎన్నికల ముందు గీత కార్మికులకు అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి, ఏడాదైనా ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆలేరు మాజీ ఎమ్మె ల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ మండిపడ్డారు. గీతకార్మికులకు ఇచ్చే పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పి, ఇప్పటివరకు రూపాయి కూడా పెంచలేదని విమర్శించారు. రేపే జీవో విడుదల చేస్తామని మంత్రి పొన్నం సాక్షిగా మూడు నెలల కింద చెప్పిన రేవంత్‌రెడ్డి మోసం చేశారని దుయ్యబట్టారు. పొన్నం ను అడ్డంపెట్టుకొని గీత కార్మికులకు ద్రోహం చేస్తున్న రేవంత్‌కు పాలించే హక్కులేదని మండిపడ్డారు.