హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పదేండ్ల పాలనలో శాంతి భద్రతలకు నిలయమైన తెలంగాణ రాష్ట్రం రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం ఆగ్రహం వ్యక్తంచేసింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ఇందుకు నిదర్శనమని పేర్కొన్నది. రాష్ట్రంలో పాలన గాడితప్పడంతో లా అండ్ ఆర్డర్ దారి తప్పిందని విమర్శించింది. శుక్రవారం శాసనమండలి, శాసనసభ బీఆర్ఎస్ఎల్పీ విప్‌లు దేశపతి శ్రీనివాస్, కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తో కూడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం డీజీపీ సీవీ ఆనంద్‌ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసింది. కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు, కారుపై బీజేపీ గూండాల దాడి ఘటనను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఎఫ్ఐఆర్లో ఏ1 నిందితుడిగా చేర్చాలని, కౌశిక్‌రెడ్డికి భద్రత పెంచాలని, హింసకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, వెనుకబడ్డ రాష్ర్టాల్లోని పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో నచ్చని రాజకీయ పార్టీ నేతల కార్యాలయాలపై దాడులు, మహిళలపై హత్యలు, లైంగికదాడులు, దోపిడీలు నిత్యకృత్యమయ్యాయని మండిపడ్డారు. వారం రోజులుగా కరీంనగర్లో బీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న దాడులు, వాటిని నిలువరించలేని పోలీసుల చేతగానితనాన్ని డీజీపీకి వివరించామని చెప్పారు.
ఆ నియోజకవర్గానికి చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు అడ్డగోలుగా మాట్లాడుతూ మరోవైపు, బీజేపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ బీఆర్ఎస్ నేతలపై దాడులకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. పాడి కౌశిక్‌రెడ్డిని హతమార్చేందుకు బండి సంజయ్ అనుచరులు పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం శోచనీయమని పేర్కొన్నారు. సీపీ, సంజయ్ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే జరిగిన జ్యువెల్లరీ దోపిడీని వారమైనా ఛేదించకపోవడం, అలుగునూర్‌లో న్యాయవాది మీద దాడి జరిగినా కేసు నమోదు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పిన బీఆర్ఎస్ నేతలపై దౌర్జన్యానికి దిగడం దుర్మార్గమని ఖండించారు. ప్రాణాలకు ముప్పు ఉన్న కౌశిక్‌రెడ్డికి భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.
అధికార మదంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చిపోతున్నారని బీఆర్ఎస్ఎల్పీ విప్ కేపీ వివేకానంద మండిపడ్డారు. బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ఉన్న రహస్య వ్యవహారాలను కేటీఆర్ బట్టబయలు చేయడంతో ఇష్టారీతిన అడ్డమైన భాషలో మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు.. సీఎం రేవంత్‌రెడ్డికి సహాయ మంత్రి. ఆయనకు ఆపదకాలంలో అండగా ఉండే వ్యక్తి’ అని ఎద్దేవా చేశారు. మరో రెండేండ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు బండి సంజయ్ గుజరాత్‌కు వెళ్లి తలదాచుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాజ్యాంగాన్ని రక్షించాల్సిన రక్షకులే భక్షకులయ్యారని శాసనమండలిలో బీఆర్ఎస్ఎల్పీ విప్ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. ‘శాంతిభద్రతలను కాపాడాల్సిన హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గూండాలను పెట్టి కొట్టిస్తున్నారు. రాష్ట్ర హోం మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నరు. నేరస్తులు ప్రజాప్రతినిధులుగా మారి ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నరు. వారంరోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలను చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? లేవా? అనే అనుమానం కలుగుతున్నది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందూ ధర్మం గురించి మాట్లాడే బండి నోటి నుంచి ఏనాడూ ఒక్క మంచి మాటరాలేదని దెప్పిపొడిచారు. అసలు ఆయన రామాయణ ఉపనిషత్తులు చదివారా? లేదంటే బూతులు మాట్లాడటంలో ఆరితేరారా? అని ప్రశ్నించారు. బీహార్ సంస్కృతిని తెలంగాణలోకి తీసుకొనిరావద్దని డీజీపీని కోరామని పేర్కొన్నారు. దాడులు ఆపకుంటే ఆత్మరక్షణ కోసం తాము కూడా ప్రతిదాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ బజారు భాషతో బీజేపీని బొందపెడుతున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. కౌశిక్‌రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఆయనపై అనుచరులతో దాడులు చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాలు, మారణహోమాలు జరుగుతుంటే పోలీస్ శాఖ ఎవరికోసం పనిచేస్తున్నదని నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పాయని విమర్శించారు. ఐపీఎస్ భార్యను గొంతుకోసి చంపినా పట్టించుకొనే నాథుడేలేడని మండిపడ్డారు. మహిళా కమిషనర్ సుమతి రోడ్డుపై నిలబడితే పోకిరీల చేష్టలను ప్రజలందరూ చూశారని గుర్తుచేశారు. సీఎం కంట్రోల్ కమాండ్ సెంటర్‌కు వెళ్లడం తప్ప ఆయనకు లా అండ్ ఆర్డర్‌పై కమాండ్లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొనేదాకా పోరాటం ఆపబోమని హెచ్చరించారు.