మంచిర్యాల ప్రతినిధి (నమస్తే తెలంగాణ)/మంచిర్యాల టౌన్, ఆగస్టు 18: మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు బీఆర్ఎస్ కౌన్సిలర్‌పై కక్షకట్టారు. పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక నస్పూరు మున్సిపాలిటీలో 21వ వార్డుకు కౌన్సిలర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న బేర సత్యనారాయణ కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే పోలీసులు ప్రైవేటు దవాఖానకు తరలించారు.
ఈ ఘటన శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో చోటుచేసుకుంది. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తనపై కక్షకట్టి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, గతంలో కూడా కేసులు పెట్టించారని ఆరోపించారు. నస్పూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 14లో ఏర్పాటు చేసిన వెంచర్లో తనకు రెండు ప్లాట్లు ఉన్నాయని తెలిపారు.
ఆ వెంచర్‌లోని మురుగు కాలువను ఆక్రమించారని అందిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ కమిషనర్ సతీశ్ అక్కడికి వెళ్లి విచారణ జరిపారని, కాలువ కబ్జాకు గురైందని నిర్ధారించుకున్న కమిషనర్.. మురుగు కాలువలో వేసిన మట్టిని తవ్వించి యధావిధిగా మార్చారని చెప్పారు. ఈ విషయంలో కమిషనర్‌తోపాటు ఫిర్యాదు చేసిన స్థానికులకు, తనకు మాటామాటా పెరింగిందని, ఈ క్రమంలో కమిషనర్‌ను తాను కులం పేరుతో దూషించినట్టు, విధులకు ఆటంకం కలిగించినట్టు తనపై నస్పూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని వివరించారు.
ఈ మేరకు హైదరాబాద్‌లో ఉన్న తనను పోలీసులు బలవంతంగా మంచిర్యాల ఏసీపీ కార్యాలయానికి తీసుకొచ్చారని, దీంతో తీవ్ర మనోవేదనకు గురై ఇక్కడే కేక్ కట్ చేసే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సత్యనారాయణ వాపోయారు. కాగా.. నస్పూరు మున్సిపల్ కౌన్సిలర్ బేర సత్యనారాయణను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణ కోసమే పిలిపించామని మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాశ్ స్పష్టంచేశారు.
శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ.. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆరోపించడం సరైంది కాదని, తాను ఇక్కడకు వచ్చి ఆరు నెలలే అయిందని, అంతకన్నా ముందు సత్యనారాయణపై ఏడెనిమిది కేసులున్నాయని వివరించారు. అంతకుముందు కూడా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైందని, ఆ కేసు కోర్టులో నడుస్తున్నదని చెప్పారు.
మున్సిపల్ కమిషనర్ సతీశ్ ఇచ్చిన ఫిర్యాదు విషయంలో విచారణకు రావాలని పిలిచినా రాలేదని, అందుకే పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లి తీసుకొచ్చారని తెలిపారు. సత్యనారాయణ గొంతుకోసుకుని కేసును దారి మళ్లించాలని చూస్తున్నారని, విచారణకు ఆయన రాని పక్షంలో తన తరపున ఎవరినైనా పంపించాల్సి ఉంటుందని ఏసీపీ వివరించారు.
నస్పూరు మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యనారాయణపై అక్రమ కేసు పెట్టిన పోలీసులు.. మున్సిపల్ కమిషనర్‌పై ఆయా శాఖల ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా, వారిని ఇబ్బందులకు గురిచేసే చర్యలు సాగుతున్నాయని ఆరోపించారు.