సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ ఫొటో ఉన్నదని టీస్టాల్‌ను తీసేయించ డమేంది? వేలాదిమంది రైతులకు సంబంధించిన మిల్క్ సెంటర్‌ను ఏకపక్షంగా మూసేయ డమేంది? అది అధికార దుర్వినియోగమే!
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ) : అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను సస్పెండ్ చేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి డి మాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, సంజయ్‌కుమార్‌తో కలిసి సిరిసిల్ల కలెక్టర్‌పై సీఎస్ శాంతికుమారికి మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా కలెక్టర్ తన విధులను దుర్వినియోగం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.వెంటనే కలెక్టర్ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అభిమానంతో ఓ వ్యక్తి టీ షాప్‌లో ఆయన ఫొటో పెట్టుకున్నారని తెలిపారు. దీన్ని ఓర్వలేక ఆ వ్యాపారి టీ షాప్‌నకు ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో ఏకంగా దానిని మూసివేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే 22 ఏండ్లుగా నడుస్తున్న కరీంనగర్ రైతు మిల్క్సెంటర్ను సైతం కలెక్టర్ మూసివేయించి, పాడిరైతులను ఇబ్బందులకు గురిచేయాలని చూశారని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఇంటి పేరు ఉన్నదని అబ్బాడి రాజిరెడ్డి అనే రైతుపై అక్రమంగా కేసు బనాయించి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బాధితుడి ఆరోగ్యం సరిగాలేదనే కనికరం లేకుండా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వేములవాడలో బీఆర్ఎస్ అనుబంధంగా పనిచేస్తున్నారనే నెపంతో ఓ మీ సేవ సెంటర్‌ను మూసివేయించారని తెలిపారు.
రాష్ట్రంలో అధికారులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే పనిలో ఉన్నారని, కాంగ్రెస్ కు తొత్తులుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీఎస్‌కు అందజేసిన ఫిర్యాదులో ఆయా ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీఆర్ఎస్ నేతలు జతచేశారు. కలెక్టర్ తన వ్యక్తిగత జీవితంలో సైతం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గృహహింస, వరకట్న, లైంగిక వేధింపులు వంటి అభియోగాలు ఉన్న వ్యక్తిపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ తీరుతో వేల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని మధుసూదనాచారి చెప్పారు. ఆయా చర్యలతో ప్రతిపక్ష పార్టీపై కలెక్టర్ కక్షసాధింపు చర్యలు స్పష్టం అవుతున్నాయని పేర్కొన్నారు. అధికార దర్పంతో కలెక్టర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రేరేపిత చర్యల్లో భాగంగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాపై క్రమశిక్షణ చర్యలతోపాటు అధికార దుర్వినియోగంపై హైలెవల్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.