‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని ప్రతినబూని ఆమరణ దీక్షకు దిగి మూడున్నర కోట్ల ప్రజల సామూహిక స్వప్నాన్ని, స్వరాష్ర్టాన్ని సాకారం చేసిండు కేసీఆర్. తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజు 2009 నవంబర్ 29. ఆ రోజును దీక్షాదివస్‌గా ఏటా జరుపుకొంటున్నది తెలంగాణ. నేడు పదిహేనేండ్ల పండుగ!
KCR | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్ 29 (2009)న బీఆర్ఎస్ దీక్షాదివస్‌గా పాటిస్తున్నది. ఉద్యమరూపం భావజాల వ్యాప్తి దశ నుంచి పోరాట పథానికి మారిన నేపథ్యాన్ని పురష్కరించుకొని గత 14 ఏండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన (డిసెంబర్ 9, 2009) వరకు 11 రోజులు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు ఉత్కంఠగా చూసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష అజరామర ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’, ‘తెలంగాణ జైత్రయాత్రో.. కేసీఆర్ శవయాత్రో’ అని ప్రతినబూనిన ఉద్విగ్నభరిత క్షణాలను నెమరువేసుకోవడంలో భాగంగా శుక్రవారం రాష్ట్రం దీక్షాదివస్‌ను జరుపుకొంటుంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న (2009) సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కేసీఆర్ ప్రకటించగానే ముందు రోజు అర్ధరాత్రి కరీంనగర్లో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. కేసీఆర్ బస చేసిన ఉత్తర తెలంగాణ భవన్ చుట్టూ మోహరించిన పోలీసులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రజలు, కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. ఫలితంగా పోలీసు బలగాల మధ్యలోనూ, ఉత్తర తెలంగాణ భవన్‌లోనూ రాత్రంతా ఉద్యమం రణమై ఎగసిపడింది. ఆ ఉద్రిక్త వాతావరణం మధ్యే తెల్లారింది. నవంబర్ 29న ఉదయం కరీంనగర్లో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ దమనకాండను ఎండగట్టారు. అకడి నుంచి ఆచార్య కొత్తపల్లి జయశంకర్, మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జీ విజయరామారావు, పార్టీ సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్యయాదవ్ తదితరులతో కలిసి వాహనంలో సిద్దిపేట దీక్షాస్థలికి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు.
ఉత్తర తెలంగాణ భవన్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకొని దీక్షను భగ్నం చేయాలని పోలీసులు భావించారు. వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు మోహరించడంతో పోలీసులు తమ వ్యూహాన్ని కరీంనగర్ పొలిమేరలకు మార్చుకున్నారు. ఆ తర్వాత అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అల్గనూర్ చౌరస్తా వద్ద కేసీఆర్ వాహనాన్ని అడ్డుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్‌ను అదుపులోకి తీసుకున్నది సాధారణ పోలీసులు కాదు.. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులతో తలపడేందుకు వినియోగించే ప్రత్యేక పోలీసు బలగం ‘ఆక్టోపస్’. ఆక్టోపస్ పోలీసులు కేసీఆర్‌ను అరెస్టు చేసి వ్యాన్‌లో ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను మించి వ్యూహాలు మారుస్తూ ఖమ్మం తరలించారు. ఖమ్మం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి అక్కడి సబ్‌జైల్‌కు తరలించారు. తనను పోలీసులు ఎక్కడైతే ముట్టుకున్నారో అక్కడే దీక్షను ప్రారంభించారు. అక్కడి నుంచి ఖమ్మం దవాఖాన, తర్వాత నిమ్స్‌కు తరలించే వరకు 11 రోజులపాటు దీక్ష కొనసాగించారు. కేసీఆర్ దీక్షతో దిగొచ్చిన కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని డిసెంబర్ 9న రాత్రి ప్రకటించిన తరువాత కేసీఆర్ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు.