హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు (KCR) ఆకాంక్షించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతివ్యక్తి అజ్ఞానపు తమస్సును తొలగించుకొని తనలో జ్ఞానపు ఉషస్సులను వెలిగించుకోవాలనే స్ఫూర్తిని దీపావళి పర్వదినం నింపుతుందని పేర్కొన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ప్రగతి వెలుగులు పంచామని గుర్తుచేశారు. ఇదే తరహాలో ప్రస్తుతం తెలంగాణ ప్రజల జీవితాల్లో కమ్ముకున్న చీకట్లు తొలగి ఆనందపు వెలుగులు నిండాలని అభిలషించారు. దీపావళి సందర్భంగా ప్రతి గడపలో ఆనందం వెల్లివిరియాలని ప్రార్థించారు.