KCR | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ) : జనాభిమానం పోటెత్తింది, తెలంగాణ భవన్ జనసంద్రమైంది. పెద్దసంఖ్యలో కదలివచ్చిన గులాబీదండుతో హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం కళకళలాడింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారని తెలుసుకుని వేలాదిగా తరలిరావడం, అభిమాన నేతను చూసిన సబ్బండ జనం సంబురంతో కార్యాలయ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. తరలివచ్చిన యువత ఉత్సాహం, మహిళాలోకం హారతుల స్వాగతంతో కారణజన్ముడైన కేసీఆర్‌పై అభిమానం ఏ మాత్రం చెక్కుచెదరలేదని మరోమారు నిరూపితమైంది.
దారివెంట దండుగా కదిలిన శ్రేణులు
ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు కేసీఆర్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నందినగర్‌లోని నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు బయల్దేరారు. వందలాది మంది నాయకులు, అభిమానులు వాహనాల్లో ఆయనను అనుసరించగా, జనహృదయనేతను చూసేందుకు దారిపొడవునా పెద్దసంఖ్యలో ప్రజలు బారులు తీరారు. పెద్దసంఖ్యలో అభిమానులు చేతులూపుతూ వెంట నడువగా కేసీఆర్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కారు దిగిన అభిమాన నాయకుడిని చూసేందుకు, చేయి కలిపేందుకు, పలుకరించాలని జనం పోటీ పడ్డారు. కేసీఆర్ తెలంగాణభవన్లోకి వెళ్తుండగా ముందుకు ఉరికారు. సెల్ఫోన్లలో ఫొటోలు తీసుకొని మురిసిపోతూ ‘జై కేసీఆర్.. సీఎం..సీఎం..’ అంటూ నినాదాలు చేయడంతో కార్యాలయ పరిసరాలన్నీ హోరెత్తాయి. కాగా, పార్టీ ప్రముఖులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌కు ఎదురేగి స్వాగతం పలుకగా, మహిళా నేతలు హారతులు ఇచ్చారు.
గులాబీమయమైన తెలంగాణభవన్
కేసీఆర్ రాకను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు, స్వాగత తోరణాలతో తెలంగాణభవన్ గులాబీమయమైంది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి సుమారు 10వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు తరలిరావడంతో సందడి కనిపించింది. కేసీఆర్ తెలంగాణభవన్‌కు చేరుకోగానే జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. కార్యాలయ ప్రాంగణం, రోడ్లపై పెద్దసంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలు నిలిపి ఉండటం కనిపించింది. కాగా, పలువురు అభిమానులు కేసీఆర్ ముఖచిత్రంతో ఉన్న మాస్కులు ధరించి సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.