KCR | హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ అడవుల్లో చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేసి.. నక్సలైట్లతో చర్చలు జరపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. మిలటరీ ఉందని చెప్పి యువకులను, గిరిజనులను ఊచకోత కోయడం సరికాదన్నారు కేసీఆర్.
ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఇక బీజేపీ కథ.. 11 ఏండ్లు అయే రాజ్యం చేయబట్టి.. తెలంగాణకు 11 రూపాయాలు ఇచ్చిండ్రా.. వట్టిదే బొబ్బ.. భభ్రాజమానం భజగోవిందం.. శుష్కప్రియాలు శూన్యహస్తాలు తప్ప.. ఏం ఇవ్వలేదు. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. ఏం ఇవ్వకుండా ఉల్టా మనవే ఖమ్మంలో ఏడు మండలాలు గుంజుకున్నరు. సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నరు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని తెలంగాణోళ్లు సంతోషపడితే.. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని నరేంద్ర మోదీ మాట్లాడుతడు. ఒక్కసారి కాదు.. ఎన్నోసార్లు అంటడు అని కేసీఆర్ మండిపడ్డారు.
బీజేపీ అంటే ఒకటి జ్ఞాపకం వచ్చింది.. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్‌గఢ్ యువకులను గిరిజనులను ఊచకోత కోస్తున్నరు.. ధర్మం కాదు అది. ఇవాళ ఏమవుతున్నది.. ఇవాళ ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నరు. ఈ సందర్భంగా నేను కోరుతున్నా.. కేంద్ర ప్రభుత్వాన్ని. బలమున్నది అని సంపుకుంట పోవుడు కాదు.. అది ప్రజాస్వామ్యం కాదు.. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేయండి. నక్సలైట్లను పిలిచి డెమోక్రాటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్లు ఏం మాట్లాడుతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందుకు రాని. కానీ అట్ల కాదు మొత్తం ఏరిపారేస్తాం.. కోసిపారేస్తాం.. నరికిపారేస్తాం అంటే.. మిలటరీ మీ దగ్గరున్నది కొడుతరు. కానీ ప్రజస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట మీద ఢిల్లీకి ఉత్తరం పంపిద్దాం.. మీ అందరి చప్పట్లతో కేంద్రానికి పంపుదాం అని కేసీఆర్ పేర్కొన్నారు.