KCR | తెలంగాణ ఉద్యమంలో ప్రజా కవి కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి ( సెప్టెంబర్ 9) సందర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రజాపక్షం నిలిచి ధిక్కారమే జీవితంగా స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపిన మానవతావాది కాళోజీ అని కేసీఆర్ కొనియాడారు. పుట్టుక.. చావుల మధ్య బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను బయలుదేరిన నాడు నిండు మనసుతో కాళోజీ దీవించారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
నూతన తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ స్ఫూర్తి కొనసాగే దిశగా వారి జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ భాష, సాహిత్యాలలో విశేషంగా కృషి చేసిన వారికి కాళోజీ పురస్కారాన్ని ఏర్పాటు చేసుకొని సాహితీవేత్తలను గౌరవించుకున్నామని అన్నారు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టుకున్నామని, వరంగల్లో కాళోజీ కళా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కాళోజీ కవి, ఆలోచనలు అన్నివేళలా ఆదర్శమని పేర్కొన్నారు.