KCR | హైదరాబాద్ : తెలంగాణ సామాజిక చారిత్రక సాహితీవేత్త, ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారితో సంభాషణ, వొడువని ముచ్చట, పుస్తకం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించాల్సిన రాజకీయ భావజాలాన్ని వ్యాప్తిచేసిన ఉద్యమ రచయిత కొంపెల్లి అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను రికార్డుచేసి వెలుగులోకి తెచ్చి, బీసీల రాజకీయ చైతన్యం కోసం పాటుపడిన ఘనత కొంపెల్లిదేనని.. వారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణవాదిగా, బహుజన వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ పలు రచనలు చేసిన వెంకట్ గౌడ్ అకాల మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. వారి మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు మిత్రులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.