KCR | హైదరాబాద్ : రాష్ట్ర సాధన కోసం ప్రాణార్పణ చేసిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థిక సాయం అందజేశారు కేసీఆర్.
ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కేసీఆర్. ఆదివారం నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవెల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో తన ప్రాణాలను బలిదానం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్నీ తానై కేసీఆర్ ఆదుకుంటున్న విషయం తెలిసిందే. కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. వైద్య విద్యలో ఆసక్తి కనబరిచిన ప్రియాంకను ఇప్పటికే కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు. ఎంబీబీఎస్ పూర్తిచేసుకుని పీజీ చేస్తున్న డా. ప్రియాంక చదువుకు కావలసిన ఆర్థిక సాయాన్ని నేడు కేసీఆర్.. కిష్టయ్య భార్య, పిల్లలకు అందించారు.
కాగా, అమరుడు కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చయమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలుసుకున్న కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని భరోసా ఇచ్చారు.