కాంగ్రెస్ పాలనలో రెండున్నరేండ్లు గడిచిపోయినయ్. ఇప్పుడు కాకికి పెడుదామంటే కంకెడు లేవు. పిట్టకు పెడుదామంటే పిడికెడు లేవు. వట్టి ముచ్చట్లు, మాటలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇరిగేషన్, విద్యుత్తురంగంలో, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిలో ఎక్కడా ఏమీ జరుగలేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలను బాగు చేయకపోగా హైడ్రా పేరుతో పేదలను రోడ్డున పడేస్తున్నది. వీరి అందానికి హైడ్రా అని తెచ్చిపెట్టిండ్రు. టీపీసీసీ చీఫ్..నిజామాబాద్‌లో మాట్లాడుతూ హైదరాబాద్‌లో హైడ్రా ఉన్నది. దాన్ని నిజామాబాద్‌కు కూడా తెస్తాం బిడ్డా అంటున్నడు. నిజాబామాద్లో నిడ్రా తెస్త అంటున్నడు. రేపు జగిత్యాలలో జిడ్రా అంటరేమో? వీళ్లకు ఏం కావాలె. పేదోళ్ల కొంపలన్నీ కూల్చుడేనా? – కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా రాష్ర్టాన్ని అప్పగిస్తే అంతా నాశనం చేశారని మండిపడ్డారు. రైతుల నుంచి మొదలుకొని ఉద్యోగులు, విద్యార్థులు, ఆటోడ్రైవర్లు అందరికీ అన్యాయమే జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. జగిత్యాలలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరిస్తూ వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాన్ని ఎండగట్టారు.
బ్యాంకులకు ఉరుకుండ్రి అన్నరు
ఎన్నికల ముందు రైతులను కాంగ్రెస్ ఎగదోసిన తీరు, అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టిన వైనంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇగ ఉరుకుండ్రి.. బ్యాంకులకు పోయి 2 లక్షలు, 3 లక్షల లోన్లు తెచ్చుకోండ్రి.. సంతకం పెడుతం లోన్లు అన్నీ మాఫీ చేస్తం అన్నరు. మరి లోన్లు మాఫీ అయినయా? ఇట్లా నోటికొచ్చినట్టు ఆడ్డగోలు మాటలు చెప్పి, ఇష్టమొచ్చిన కథలు చెప్పి అర్రాస్ పాట పాడినట్టు చేసిండ్రు. కేసీఆర్ 10 వేలు ఇస్తుండా.. ఐతే మేం 15 వేలు ఇస్తం. పెన్షన్లు 2 వేలు ఇస్తున్నడా.. ఐతే మేం 4 వేలు ఇస్తం. వికలాంగులకు 4 వేలు ఇస్తున్నడా.. మేం 6 వేలు ఇస్తం అని అడ్డగోలు మాటలు చెప్పేసరికి మనోళ్లు మోసపోయిరి. నేను అప్పుడే చెప్పిన ఇది మోసం రా నాయినా.. గోస పడుతమని! ఇది అయ్యేది కాదు.. ఆర్థిక పరిస్థితి అలా లేదు అని మీటింగ్‌లో చెప్పిన. కానీ కొద్ది మంది ఆశపడితే ఇప్పుడు ఏమైంది? 1.7 శాతంతో బీఆర్ఎస్ ఓడిపోయింది. మనం కూడా 39 ఎమ్మెల్యేలు గెలిచినం. ఇంకో 10 మంది కొద్దికొద్ది తేడాతో ఓడిపోయిండ్రు’ అని తెలిపారు.
ఒక్కటన్న మంచిపని చేసిండ్రా?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిన మంచి పని ఏమున్నదని కేసీఆర్ నిలదీశారు. ఎక్కడ చూసినా చిల్లర మాటల తప్ప ఒక్కటంటే ఒక్కటన్న నిర్మాణాత్మక కార్యక్రమం ఉన్నదా? ఏదైనా ఒక గొప్ప స్కీమ్ మొదలు పెట్టిండ్రా?’ అని తూర్పారబట్టారు. ‘పొదరిల్లులా వడ్డించిన విస్తరిలా తెలంగాణను మీకు అప్పగించినం. తెలంగాణ ఎన్నిట్లో నంబర్ వన్‌గా ఉండె! మంచినీళ్ల సప్లయ్‌లో నంబర్ వన్, కరెంట్ సప్లయ్‌లో నంబర్ వన్, తలసరి ఆదాయంలో నంబర్ వన్, జీఎస్డీపీలో నంబర్ వన్ ఇలా అన్నింట్లో నంబర్ వన్‌గా నిలిచి కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకున్నది’ అని గుర్తుచేశారు.
యూరియా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం
కాంగ్రెస్ సర్కార్‌లో రైతులకు కనీసం యూరియా కూడా అందడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దుకాణాల్లో లేని యూరియా యాప్‌లో దొరుకుతుందా? అని నిలదీశారు. ‘యూరియా బస్త్తా ఇవ్వడానికి చేతనైతలేదా ఈ ప్రభుత్వానికి? యూరియా బస్తా కావాలంటే.. యాప్ పెట్టినమంటున్నరు. దుకాణంలో లేకపోతే యాప్‌లకు వస్తదా? దమ్ముంటే యూరియా తెచ్చి దుకాండ్లలో పెట్టాలె. ఆ యాప్‌లు పట్టుకొని తిరిగితే కాళ్లకు వాపులు వస్తున్నయి తప్ప బస్తాలు మాత్రం దొరుకుతలేవు. అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లనే ఉండె. అప్పుడు పోలీస్ స్టేషన్ల పెట్టి యూరియా అమ్మిండ్రు. ఇయ్యాల మళ్లీ చెప్పుల లైన్లు తప్పుతలేవు. కాళ్లకు వాపులు వస్తున్నయ్. 10 బస్తాలు కావాలని ఆటో రిక్షా వాడికి చెప్తే పొలంకాడికి తెచ్చి వేసిపోతుండె. కానీ ఇప్పుడు యూరియా కోసం ఇంత బాధ పడాల్నా? ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం? ఎంత చేతగాని ప్రభుత్వం? అన్నింటికీ బాధనే కదా!’ అని నిప్పులు చెరిగారు.
కేసీఆర్ సభ పెడితేనే రైతుబంధు వేస్తరా?
‘ఇయ్యాల కాంగ్రెస్ వాళ్లు సభ పెట్టిండ్రట! ఆడ పైసలు వేస్తారట! ఒక తేపకేసే రైతు బంధు సక్కగ వేసిండ్రా? నెలకొక కిస్తీనా? ఎకరానికా? అంటే రెండు నెలలకో ఎకరానికా? రెండు నెలలకు ఒక ఎకరానికి రైతుభరోసా ఇచ్చిండు. రూ.6 వేలు ఖాతాలో వేసి ఇగ మా అంత సిపాయి లేడని బొచ్చె కొట్టుకుంటున్నడు. ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు రైతుబంధు ఎట్లా పడేది? పది రోజుల గ్యాపులో రైతులందరికీ వచ్చేది’ అని కేసీఆర్ గుర్తుచేశారు. ‘నాడు ఠంగుఠంగు మని సెల్ఫోన్లు మోగుతుండె.. రైతులు ఎంత ఆనందంగా ఉండేటోళ్లు! తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసి దళారులు లేకుండా రైతులకు ఖాతాల్లో పైసలు వేసేది. సివిల్ సప్లయ్ మంత్రిగా ‘మా గంగుల కమలాకర్ కొట్లాడి మరీ రైతులకు పైసలు వేసేది.
మొదలు రైతులకు పైసలు ఇస్తే వాళ్లు ఇంకో పని చేసుకుంటరని చెప్పేటోడు. ధాన్యం అమ్మిన పైసలతో పాటు రైతుబంధు పైసలు కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు ఏమైంది? ఎరువులు కావాలంటే యాప్, రైతుబంధు కోసం మొగులు దిక్కు చూడాలె. అది నెలకో ఎకరానికి వస్తది. జగిత్యాలలో కేసీఆర్ సభ అనగానే రైతుబంధు పైసలు విడుదల చేస్తున్నరట! అంటే రైతుబంధు రావాలంటే నేను మళ్లొక సభ పెట్టాల్నా? రైతుబంధు మూడో వాయిదా రావాలంటే కేసీఆర్ ఎక్కడో ఒకచోట మరో సభ పెట్టాల్నా! ఇది ప్రభుత్వమా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు ద్వారా రైతులకు రూ.75 వేల కోట్లు ఇచ్చినం. పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతుబంధు సమితి అధ్యక్షుడిగా దగ్గరుండి పైసలు వేయించిండు. మరి ఇప్పుడు ఏం బీమారి వచ్చింది?’ అని తూర్పారబట్టారు.
మరి ఈ సిపాయిలు ఏం చేస్తున్నరు?
‘ఎన్నికల్లో కాంగ్రెస్ సిపాయిలు ఏం మాట్లాడిండ్రు? కేసీఆర్ అనేటోడు సక్కగ చేస్తలేడు. మేం చాలా సిపాయిలం.. మాది చాలా అనుభవం ఉన్న పార్టీ.. మేం బ్రహ్మాండంగా చేస్తం. ఆరు చందమామలు, ఏడు సూర్యులను పెడుతమని ఆనాడు నరికిండ్రు. మరిప్పుడు ఏం చేస్తున్నరు’ అని కేసీఆర్ నిలదీశారు. ‘రాష్ట్ర ఆదాయం ఎందుకు దిగజారిపోయిందో ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండె? రైతుల భూముల ధరలు ఎలా ఉండె? హైవే పక్కకు భూమి ఉంటే ఎకరం 2 కోట్లు, 3 కోట్లు ధర, డాంబర్ రోడ్డు పక్కన ఉంటే కోటి రూపాయలు. రైతులకు ధీమా ఉండేది. ఇంట్లో అమ్మాయి పెళ్లి చేయాలంటే.. ఏ ఏముంది పావెడంత అమ్మి చేస్తలేవయ్యా అని చెప్పేటోళ్లు. కానీ ఈ రోజు అమ్మేటోళ్లు ఉన్నరు గని కొనేటోళ్లు లేరు.. రాష్ట్రంలో ఎవర్ని మాట్లాడిచ్చినా, ఎవర్ని అడిగినా ఇవే బాధలు. రైతుల భూముల ధరలు పడిపోయినయి. ఇది నిజమేనా? ఏమైంది మరి? ఏం రోగమొచ్చింది’ అని తూర్పారబట్టారు.
మక్కలు కొంటరా? లేదా?
‘రైతులు మక్కలు పండించారు. సర్కార్ కొంటే కొంటమని చెప్పండి. కొనకుంటే కొనమని చెప్పండి. అంతేగాని ఈ చేతగాని దొంగతనమెందుకు?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘లోపట అధికారులకేమో కొనొద్దని చెప్తున్నరు.. పైకేమో కొంటామని చెప్తున్నరు. ఈ రోజు మక్కలు కొంటరనే ధీమా రైతులకు ఉన్నదా? వడ్లు కొంటున్నరా? పంటలే కొంటలేరు.. పైగా బోనస్ ఇస్తమని బోగస్ మాటలు చెప్తాండ్రు. ఎవరికైనా బోనస్ వచ్చిందా? అంతా బోగస్. గతంలో పంట వేసినప్పటి నుంచి కొనుగోలు వరకు బీఆర్ఎస్ రైతులకు తోడుగా నిలిచింది. రైతులను ఆదుకున్నది. కానీ ఇప్పుడు రైతులంతా ఆగమాగమైతున్నరు. రైతుబంధు వస్తదో లేదో? తెల్వది. ధాన్యం కొంటరో లేదో తెల్వది. ఒకవేళ కొంటే పైసలు ఎప్పుడు పడుతయో తెల్వదు. రైతులు చాలా సతమతమవుతున్నరు’ అని తూర్పారబట్టారు.
ఎవర్ని కదిలించినా బాధలే
‘ఈ రాష్ట్రంలో ఎవర్ని కదిలిచ్చినా.. ఎవర్ని మాట్లాడిచ్చినా.. ఒక విద్యార్థిని మాట్లాడిచ్చినా, రిటైర్డ్ ఉద్యోగిని మాట్లాడిచ్చినా, పని చేస్తున్న ఉద్యోగిని మాట్లాడిచ్చినా, రైతును మాట్లాడిచ్చినా ప్రతివాడూ అసంతృప్తి, బాధతో ఉన్నరు’ అని కేసీఆర్ వాపోయారు. తమకు అన్యాయం జరిగిందనే బాధలో ఉన్నారని చెప్పారు. ‘అన్నీ సర్వనాశనం చేస్తున్నరు. పొద్దునలేచి పేపర్ తిప్పితే బాధ కలిగే పరిస్థితులున్నయి. అద్భుతంగా ఉన్న సింగరేణిని నాశనం చేసి బొగ్గు స్కామ్, సివిల్ సప్లయ్‌లో స్కామ్ ఇట్లా మొత్తం అన్నీ దోపిడీలు, స్కామ్‌లు తప్ప ప్రజల కోసం పని చేసే పరిస్థితిలేదు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
అందరికీ అన్యాయమే
‘చేనేత కార్మికులు మంచిగ బతికేటోళ్లు. ఇప్పుడు మళ్లీ వాళ్ల ఆత్మహత్యలు మొదలైతున్నయ్. వారికిచ్చే ఆర్డర్లు బంద్ చేసిండ్రు. వాటిని కమీషన్ల కోసం ఇంకెవరికో ఇస్తున్నరు. వాళ్లను అవస్థలు పెడుతున్నరు’ అని కేసీఆర్ వాపోయారు. ‘ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నరు కాబట్టి ఆనాడు 72 శాతం పీఆర్సీ ఇచ్చినం. టీఎన్జీవోలు సమైక్య రాష్ట్రంలోనూ వారి ఉనికి పోగొట్టుకోలేదు. టీఎన్జీవోలుగానే ఉన్నరు. అందుకే వాళ్లను గౌరవించి,గుర్తించి బ్రహ్మాండంగా వారికి 72 శాతం పీఆర్సీ ఇచ్చినం.
కానీ ఈరోజు ఏడు రూపాయలైనా, 7 శాతమైనా ఇచ్చిండ్రా? మరి ఏమైంది? ఏం బీమారి వచ్చింది? ఎంత మందిని మోసం చేస్తరు? చివరికి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే రిటైర్డ్ ఉద్యోగులు దాచుకున్న డబ్బులను కూడా వారికి ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో రిక్షా కార్మికులతో మాట్లాడితే.. ఇదేదో పనికిమాలిన ఫ్రీ బస్సు పథకం పెట్టి మా పొట్టగొడుతున్నరు.. మేం నాశనమైపోయినమని ఏడుస్తున్నరు. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ నేను పెట్టలే.. రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు పెట్టిండు. దాంతోటి పిల్లలకు మంచి లాభం జరిగింది. నేను దాన్ని కొనసాగించిన. కానీ ఈ రోజు బీసీ, ఎస్సీల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా 10-12 వేల కోట్లు బకాయిలు పెడితే వాళ్లంతా రోడ్డున పడుతున్నరు. కాలేజీలు కోర్టుకు పోతే.. పిల్లల వద్దే ఫీజులు వసూలు చేసుకోవాలని చెప్తున్నయి.. ఇప్పుడా పిల్లల గతి ఏంగావాలె? విదేశాల్లో పిల్లలకు సీట్లు వస్తే అంబేద్కర్, ఫూలే పేరుపై రూ 20 లక్షలు ఇచ్చినం. ఇప్పుడు దీన్ని కూడా బంద్ పెట్టిండ్రు. ఆ పిల్లలు ఆగమైతున్నరు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉరుకుండ్రి.. బ్యాంకులకు పోయి 2 లక్షలు, 3 లక్షల లోన్లు తెచ్చుకోండ్రి.. సంతకం పెడుతం.. లోన్లన్నీ మాఫీ చేస్తమన్నరు. మరి మాఫీ అయినయా? నోటికొచ్చినట్టు ఆడ్డగోలు మాటలు చెప్పి అర్రాస్ పాడినట్టు చేసిండ్రు. కేసీఆర్ 10 వేలు ఇస్తుండా.. ఐతే మేం 15 వేలు ఇస్తం! పెన్షన్లు 2 వేలు ఇస్తున్నడా.. ఐతే మేం 4 వేలు ఇస్తం! వికలాంగులకు 4 వేలు ఇస్తున్నడా.. మేం 6 వేలు ఇస్తం! అని అడ్డగోలు మాటలు చెప్పేసరికి మనోళ్లు మోసపోయిరి. నేను అప్పుడే చెప్పిన ఇది మోసం రా నాయినా..
గోస పడుతమని!
-కేసీఆర్
అంతా బాగా చేసిన తెలంగాణ.. రెండున్నరేండ్లలో ఎట్ల మారిపాయె. ఇవాళ ఎవర్ని మాట్లాడించినా ఏడ్చే పరిస్థితి ఉన్నది. రైతులను మాట్లాడిస్తే గొడగొడ ఏడుస్తున్నరు. నాశనమైపోయిందన్నా.. చెడగొట్టుకుంటున్నం.. మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నమని బాధపడుతున్నరు. ఇంతకు ముందు కడుపులో సల్ల కదలకుండా రైతులకు ఎంత మంచిగ ఉండె! కరెంట్‌కు బాధ ఉండెనా? నీళ్లకు బాధ ఉండెనా? దేని బాధ ఉండె?
-కేసీఆర్