BRS | హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం తొణకిసలాడుతున్నది. పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏడాదంతా రజతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో ఉద్యమస్ఫూర్తి తొణకిసలాడుతున్నది. తెలంగాణ భవన్లో జరిగిన కీలక సమావేశంలో శ్రేణులకు కేసీఆర్ కీలక సందేశాలు ఇచ్చారు. బీఆర్ఎస్ సాధారణ రాజకీయ పార్టీ కాదని, అధికారం కోసం అర్రులుచాస్తూ ఏ ఎండకు ఆ గొడుగుపట్టే వేదిక కాదని స్పష్టంచేశారు. రాజకీయ పార్టీకి గెలుపోటములు సహజమని, అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోవడం, అధికారంలో లేనప్పుడు కుంగిపోవటం బీఆర్ఎస్ డీఎన్ఏలోనే లేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవటం, ఓడిపోవడం సర్వసాధారణ విషయమని చెప్పారు. కేసీఆర్ పిలుపు, బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం చూస్తుంటే ప్రజలకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని మరోసారి స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
ఎన్నికల్లో పార్టీలు కాదని, ప్రజల ఆకాంక్షలు గెలవాలని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రతీ సభలో చెప్పారు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన అలవికాని హామీలతో కేవలం 2.04 శాతం ఓట్లతో అధికారం కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించకలేకపోయింది. దీంతో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రజాక్షేత్రంలో నిలవటం కష్టమని కాంగ్రెస్, బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత గులాబీ శ్రేణుల్లో ఒకింత నైరాశ్యం నెలకొన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. కానీ బీఆర్ఎస్లో ఆ నిరాశ ఎంతోకాలం కొనసాగలేదని, అతితక్కువ కాలంలోనే తేరుకొని ప్రజాజీవనంతో పార్టీ మమేకమైందని ఆ తర్వాతి పరిణామాలతో స్పష్టమైందని చెప్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఆశ్చర్యపడేలా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ దూసుకెళ్లిందని స్పష్టంచేస్తున్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు, కార్మికులు, యువత బీఆర్ఎస్ వైపు తిరిగి చూడటం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ఆయువుపట్టుగా రాష్ట్రంలో ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని గడిచిన 14నెలల కాలంలో పరిణామాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని ప్రజలు స్పష్టంచేస్తున్నారు.
అధికారం లేకపోతే రాజకీయాల్లో నిలవలేమని భావించిన కొంతమంది రాజకీయ నాయకులు, పదవుల కోసం బీఆర్ఎస్ను వీడారు. మరికొందరు అంటీముట్టనట్టుగా దూరంగా ఉన్నారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణలో బీఆర్ఎస్ మాత్రమే చాంపియన్ అని గుర్తించిన రాజకీయ పార్టీలు, మేధావులు కేసీఆర్ పిలుపుతో గులాబీ దళానికి చేరువ అవుతున్నారు. ‘బీఆర్ఎస్ 25 ఏండ్ల ఆవిర్భావ ఉత్సవాలంటే కేవలం పార్టీకి సంబంధించినవి కాదు. యావత్ తెలంగాణ సమాజం ఉజ్వల ప్రస్థానం. అందులో పార్టీగా శ్రేణులున్నా మనల్ని నడిపించిన ప్రజలు, ఆ ప్రజల కష్టసుఖాల్లో భాగమైన ప్రతీవ్యక్తి మనకు ఆత్మీయులే. ఎక్కడిక్కడ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి. మనకు రాజకీయాలు ముఖ్యంకాదు. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. కేసీఆర్ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌ను కలవరానికి గురి చేస్తున్నదని, ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు.
బీఆర్ఎస్ రజత్సోవాలు శ్రేణుల్లో ఉద్యమకాలం నాటి ఉత్సాహం ఆవిష్కరిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ‘కేసీఆర్ బయటకు రానంత వరకే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఆటలు సాగుతాయి. ఆయన వ్యూహాలు, ఎత్తుగడలను చూసి తట్టుకోవటం ఆ పార్టీలకు కష్టం’ అని సామాజిక విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజల్లో ఉండటం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం ప్రధాన కర్తవ్యాలుగా కేసీఆర్ పిలుపుతో శ్రేణుల్లో జోష్ నెలకొంది. కేసీఆర్ ఇచ్చిన టాస్క్ రెండువైపులా పదునెక్కిన కత్తి లాంటిదని, ఆ పదునను తట్టుకొని నిలబడం ప్రభుత్వానికి సవాలేనని విశ్లేషకులు చెప్తున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం మాత్రమే చేయటంలేదని, సందర్భోచితమైన కార్యాచరణ రూపొందిస్తూనే ఉన్నారని తాజా పరిణామాలు తేల్చిచెప్తున్నాయని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడిక్కడ ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రశ్నాస్ర్తాలు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న చాలా నిర్ణయాలను బీఆర్ఎస్ పోరాటం వల్ల వెనక్కి తీసుకునేలా చేసిందని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ మొదట్లో భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం దుందుడుగా వ్యవహరిస్తూ ఇష్టారీతిగా ప్రజావ్యతిరేక విధానాలను అనుసరించడం వల్ల బీఆర్ఎస్ నిత్యం ప్రజాక్షేత్రంలో నిలుస్తూ ప్రజల హృదయాల్లో తిరిగి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవటం అప్రతిహతంగా కొనసాగిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.