KCR Pressmeet | ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇచ్చి తీరాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. బోనస్ ఇచ్చే దాకా వెంటాడుతామని అన్నారు. పంట బోనస్ కోసం ఏప్రిల్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడారు.
తమ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లకు 7600 పైచిలుకు కేంద్రాలు పెట్టామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపట్నంచే కొనుగోళ్లు అంటున్నరు.. కానీ ఎన్ని కేంద్రాలు పెడతారో చెప్పడం లేదని అన్నారు. ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేద్దామని చూస్తున్నారా? అని మండిపడ్డారు. పాత కేంద్రాలకు ఒక్క కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పోయిన పంట పోనూ.. కొత్త పంట వస్తది కాబట్టి.. ఆ వచ్చే పంటకు 500 బోనస్ ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరాల్సిందేనని డిమాండ్ చేవారు. అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారని.. దాని ప్రకారం కచ్చితంగా ప్రతి పంటకు బోనస్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. రేపట్నుంచి వరి పంట వస్తుంది కాబట్టి రూ.500 బోనస్ ఇవ్వాలని అన్నారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి జిల్లాలో కలెక్టర్లకు రైతుల పక్షాన మెమొరాండం సమర్పించాలని సూచించారు. అదే రోజున శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులందరూ హైదరాబాద్లో ప్రభుత్వానికి మెమొరాండం ఇస్తారని తెలిపారు. బోనస్ ఇవ్వాలని చెప్పి ఏప్రిల్ 6వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. ఒక్క రోజు దీక్ష తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా నిలదీస్తామని తెలిపారు. బోనస్ ఇచ్చే దాకా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
దుర్భర పరిస్థితిని చూసి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఎప్పుడూ ఈ అసమర్థ పాలనే ఉండదని తెలిపారు. మీ కోసం ఈ ప్రభుత్వంతో పోరాడుతామని.. అందరం కలిసి యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. వాళ్లు ఇచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేర్చే దాకా వెంటపడి తరుముదామన్నారు. దయచేసి ఆత్మస్తైర్యం కోల్పోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.