కొండాపూర్/బోధన్ రూరల్, డిసెంబర్11: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్‌లో గురువారం జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి ఒక్కఓటు తేడాతో గెలుపొందాడు. కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి సురేశ్‌పై, బీఆర్ఎస్ అభ్యర్థి బేగరి నర్సింహులు ఒక్క ఓటుతో గెలుపొందగా.. కాంగ్రెస్ అభ్యర్థి రీ కౌంటింగ్‌కు పట్టుపట్టాడు. ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ చేయడంతో బీఆర్ఎస్ అభ్యర్థికి మళ్లీ ఒక్కఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో ఎన్నికల అధికారులు నర్సింహులు గెలుపొందినట్టు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కిలో నరేందర్‌రెడ్డి కేవలం ఒక్కఓటు తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించాడు. సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌కు 870 ఓట్లు రాగా, నరేందర్‌రెడ్డికి 871 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన ఒక్క ఓటు తేడాతో ఉత్కంఠ విజయం సాధించాడు.