Sircilla | సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కైవసమైంది. చైర్మన్గా రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్గా అడ్డగట్ల మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సింగిల్ నామినేషన్ దాఖలుతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. కాగా, కొత్తగా ఎన్నికైన పాలకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. 12 డైరెక్టర్ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, ఇద్దరు ఇండిపెండెంట్లు, బీజేపీ, కాంగ్రెస్ తరఫున ఒక్కో అభ్యర్థి గెలుపొందారు. గెలిచిన ఇద్దరు ఇండిపెండెంట్లలో ఒకరు గుడ్ల సత్యానందం బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ మద్దతుదారుల సంఖ్య 9కి చేరింది. ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం బీఆర్ఎస్ ప్యానల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేసింది. సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఫలించిన కేటీఆర్ వ్యూహం
అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహం ఫలించింది. ఎన్నికల ముందు రెండు రోజులుగా ఓటర్లకు స్వయంగా ఫోన్ చేసి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేటీఆర్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో వారికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.