హుస్నాబాద్/తూప్రాన్/ఇల్లెందు, ఏప్రిల్ 5: తమది ప్రజాపాలన అని చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు, క్యాంపు ఆఫీస్లపై దాడులు చేస్తూ రాష్ట్రంలో గూండా పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంపు ఆఫీస్‌పై దాడి చేసి ఫర్నిచర్, కిటికీలు ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
గజ్వేల్ ఘటనను నిరసిస్తూ మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతిపత్రం అందజేశారు.
ఇల్లెందులో నల్లజెండాలతో నిరసన
గజ్వేల్ ఘటనను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జగదాంబ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంపై మండిపడ్డారు. తెలంగాణ సాధకుడి కార్యాలయంపై దాడి అంటే యావత్ తెలంగాణ జాతి మీద జరిగిన దాడిగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ దుండగులను వెంటనే గుర్తించి, అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ జోలికొస్తే మాడి మసైపోతరు.. గజ్వేల్ ఘటనపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత జీవన్‌రెడ్డి
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 5: కేసీఆర్ జోలికొస్తే మాడిమసైపోతరు జాగ్రత్త అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హెచ్చరించారు. గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఆదివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్నది ప్రజాపాలన కాదని, సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లో నడుస్తున్న రౌడీదర్బార్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు.
కేసీఆర్ కార్యాలయం మీద జరిగింది దాడి కాదని, ఇది నాలుగున్నర కోట్ల ప్రజల గుండెల మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇందిరమ్మ రాజ్యంలో అరాచకం కరాళనృత్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. లోక్‌సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్‌గాంధీ తన క్యాంపు ఆఫీస్లోప్రధాని మోదీ ఫొటో పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కార్యాలయం మీద దాడిని హత్యాయత్నంగా పరిగణించి కేసులు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.