 
                                                            హనుమకొండ, అక్టోబర్ 30: మొంథా తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం, రోడ్లపైకి డ్రైనేజీ, వర్షం నీరు భారీగా చేరడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బాధితులకు అండగా నిలిచింది. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపు మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పార్టీ శ్రేణులు రెండు రోజుల నుంచి సహాయక చర్యల్లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. బాధితులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. నీట మునిగిన ప్రాంతాల్లో చికుకున్న ప్రజలకు ఆహారం, తాగునీరు అందజేస్తూ, వారి అవసరాలను తెలుసుకుంటూ సహాయం అందజేశారు.
హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు పలు డివిజన్లలో వంటలు వండి, భోజనం ప్యాకెట్లను సిద్ధం చేసి, ప్రత్యేక వాహనాల ద్వారా జల దిగ్బంధమైన ప్రాంతాలకు వెళ్లి ఇంటింటికీ పంపిణీ చేశారు. ఇండ్ల నుంచి బయటకు రాలేని వారికి స్వయంగా వెళ్లి ఆహారం అందజేశారు. మైసయ్యనగర్, ఎస్సార్‌నగర్, గొర్రెకుంట, ప్రగతినగర్, దీన్‌దయాళ్‌నగర్, పోతననగర్ సహా పలు కాలనీల్లో సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.
సమ్మయ్యనగర్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాస్యం విజయ్‌భాస్కర్ ఆహారం అందించారు. కాపువాడలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకులు రంజిత్‌రెడ్డి, నరేందర్ ఆధ్వర్యంలో భోజనాల ఏర్పాట్లు చేశారు. నగరంలో నిరాశ్రయులైన సుమారు 5 వేల మందికి అల్పాహారం, ఆహారం అందించారు. ఆహార పంపిణీలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు బుద్దె వెంకన్న, మాడిశెట్టి అరుణ్‌కుమార్, అనిల్, కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లోనూ గులాబీ శ్రేణులు రైతులకు అండగా నిలిచారు.
 
                            