BRS | స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనపై శనివారం నాడు బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కుల గణన విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల సమావేశం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
తమిళనాడు, కేరళలో అమలు చేస్తున్న రిజర్వేషన్ల విధానం అధ్యయనం చేయడానికి, అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వ చిత్తశుద్ధి వల్ల బీసీలకు సమకూరుతున్న రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలపై అధ్యయన నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి, పార్టీకి అందజేయాలని సమావేశం నిర్ణయించింది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఈ విధంగా ఉంటే, వివిధ డిక్లరేషన్ల పేరిట ఆయా వర్గాలకు ఇచ్చిన మోసపూరిత హామీలను సమావేశంలో ఎండగట్టారు. నవంబర్ 10వ తేదీలోగా కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కుల గణన చేసి, 42 శాతం రిజర్వేషన్ల కల్పన, బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని సమావేశం నిర్ణయించింది.
Brs Leaders1
శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, జాజల సురేందర్, నోముల భగత్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ చైర్మన్లు పల్లె రవి కుమార్ గౌడ్, జూలూరి గౌరీ శంకర్, డాక్టర్ ఆంజనేయ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, చిరుమళ్ల రాకేశ్ కుమార్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీసీ కమీషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్, ఉపేంద్ర చారి, గట్టు రాంచందర్ రావు, గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.