హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : టెండర్ ధాన్యం మాటున పౌర సరఫరాల శాఖలో కోట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయా? ధాన్యం ‘మేత’కు రంగం సిద్ధమైందా? నిబంధనలకు పాతరేసి.. బిడ్డర్లకు దోచిపెట్టేందుకు సర్కారు పెద్దలు తహతహలాడుతున్నారా? తెరవెనుక ‘ఉత్తమ’ నేత, ‘వ్యూహకర్త’ చక్రం తిప్పుతున్నారా? కార్పొరేషన్‌ను నిండా ముంచేసి రూ. 1000 కోట్ల కుంభకోణానికి పక్కా స్కెచ్ వేశారా? ఇవీ ఇటీవల గడువు ముగిసిన ధాన్యం టెండర్లకు సంబంధించి వినిపిస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సివిల్‌సైప్లె వర్గాల్లో అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పెద్దలు, మధ్యవర్తులు పక్కాగా పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే టెండర్ ధాన్యంలో టెండర్ ధరకు అదనంగా రూ.413 కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు టెండర్ నిబంధనలకు పాతరేసి బిడ్డర్లకు చెందిన ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము రూ.582 కోట్లు తిరిగి ఇచ్చేసేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఆ తర్వాత అందులోనుంచి ‘నాకింత.. నీకింత’ చొప్పున పంపకాలు చేసుకునేలా ఇప్పటికే ఒప్పం దం కుదిరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా మొత్తంగా రూ.1000 కోట్ల కుంభకోణానికి పక్కా స్కెచ్ వేసినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించిన 38 లక్షల టన్నుల ధాన్యాన్ని సివిల్‌సైప్లె నిరుడు ఫిబ్రవరిలో వేలం ద్వారా విక్రయించింది. గత 16 నెలలుగా బిడ్డర్లు పూర్తి ధాన్యం ఎత్తలేదు. చివరిసారి ఇచ్చిన గడువు సైతం ఈ నెల 11తో ముగిసింది. ఇప్పటివరకు కేవలం 19 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ఎత్తారు. ఇంకా సగం మిల్లుల్లోనే ఉండిపోయింది. తాము ధాన్యం ఎత్తలేమంటూ బిడ్డర్ సంస్థలు చేతులెత్తేశాయి. ఈ మేరకు నాకాఫ్, కేంద్రీయ భండార్, మంచుకొండ ఆగ్రోటెక్లు సివిల్సైప్లెకి లేఖ రాశాయి. తాము 19 లక్షల టన్నుల టెండర్ ధాన్యం ఎత్తామని, ఇంకా 1.5 లక్షల టన్నుల ధాన్యాన్ని ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి కోసం సివిల్‌సైప్లె పక్కకు పెట్టిందని లేఖలో పేర్కొన్నాయి. మరో 5.4 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లో అందుబాటులో లేదని సివిల్‌సైప్లె పేర్కొన్నట్టు తెలిపింది. ఇక మిగిలిన ధాన్యం కూడా మిల్లుల్లో లేదని పేర్కొంది. అందువల్ల తాము ధాన్యం ఎత్తలేమని, తాము టెండర్ సమయంలో అందించిన బ్యాంక్ గ్యారెంటీలను తిరిగి ఇవ్వాలని కోరాయి. సదరు సంస్థల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ సమయంలో ధాన్యం తనిఖీకి అవకాశం ఇచ్చినప్పుడు చూసుకోకుండా, ధాన్యం లేదని తెలిసి ఎందుకు టెండర్ దాఖలు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టెండర్ నిబంధనల ప్రకారం గడువులోగా ధాన్యం ఎత్తడంలో బిడ్డర్లు విఫలమైతే వారు సమర్పించిన ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్లను జప్తు చేయాలి. డిపాజిట్ రూపంలో 38 లక్షల టన్నులకు సంబంధించి రూ.202 కోట్లు ఎంఈడీ సమర్పించారు. టెండర్ దక్కించుకున్న బిడ్డర్లు మొత్తం ధాన్యం విలువలో 5 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఈ విధంగా రూ.7,600 కోట్ల విలువైన ధాన్యానికి రూ.380 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ కింద బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చారు. ఈ విధంగా ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్ కింద బిడ్డర్లు రూ.582 కోట్లకు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారు. ఇప్పుడు ధాన్యం ఎత్తడంలో విఫలమైన నేపథ్యంలో ఆ రూ.582 కోట్లు జప్తు కావాలి. కానీ జప్తును అడ్డుకొనేందుకు వారు ధాన్యం ఎత్తలేమంటూ లేఖ రాసినట్టు తెలిసింది. ఇందుకోసం బిడ్డర్ల వెనుకున్న మధ్యవర్తులు సర్కారులోని పెద్దలను ‘కొనుగోలు’ చేసినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆ నిధులు జప్తు చేస్తే ఉపయోగం లేదని, వాటిని విడుదల చేయిస్తే ‘మీకింత.. మాకింత’ పంచుకోవచ్చని ఒప్పందం జరిగినట్టు తెలుస్తున్నది. దీంతో పెద్దల సలహా మేరకే బిడ్డర్లు సివిల్సైప్లెకి లేఖ రాసినట్టు సమాచారం. బిడ్డర్ల లేఖను సాకుగా చూపుతూ వారు సమర్పించిన రూ.582 కోట్ల డిపాజిట్లను జప్తు చేయకుండా తిరిగి వెనక్కి ఇచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు మార్గం సుగుమం చేసేలా ధాన్యం టెండర్లను రద్దు చేసే ఆలోచన ఉన్నట్టు తెలిసింది.
టెండర్లో వేర్వేరుగా పాల్గొని, వేర్వేరుగా డిపాజిట్లు చేసి, ధాన్యం కూడా ఎత్తిన మూడు సంస్థలు తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలంటూ ఉమ్మడిగా లేఖ రాయడం చర్చనీయాంశమైంది. కేంద్రీయ భండార్, నాకాఫ్, మంచుకొండ ఆగ్రోటెక్ సంస్థలు టెండర్లో వేర్వేరుగా పాల్గొన్నాయి. అలాంటి సంస్థలు ఇక తాము ధాన్యం ఎత్తలేమని, తమ డిపాజిట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఒకే లేఖ రాశాయి. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థల వెనుక ఒకే గ్రూప్‌నకు చెందిన మధ్యవర్తులు ఉన్నట్టు తెలిసింది. ఓ రాజకీయ నేత వీటి వెనక ఉండి సివిల్సైప్లెకి ‘మచ్చ’ తీసుకురాగా మరో ‘ఆస్థాన’ వ్యాపారి తెరవెనుక చక్రం తిప్పినట్టు తెలుస్తున్నది.
ధాన్యం టెండర్లకు సంబంధించి మధ్యవర్తులు సిగ్గు ఎగ్గు లేకుండా అవినీతికి పాల్పడ్డారు. లారీ పెట్టింది లేదు… సంచి ఎత్తింది లేదు. కానీ వందల కోట్లు రాలిపోయాయి. మిల్లర్ల వద్ద నుంచి టెండర్ ధరకు అదనంగా రూ.413 కోట్లకు పైగా వసూలు చేశారు. ఇదెలా అంటే.. టెండర్లో క్వింటాల్ ధాన్యం ధర సగటున రూ.2 వేలు పలికింది. కానీ బిడ్డర్ల తరఫున రంగంలోకి దిగిన మధ్యవర్తులు మిల్లర్లపై ఒత్తిడి పెంచి క్వింటాలుకు రూ. 223- 230 వరకు వసూలు చేశారు. వరంగల్ జిల్లాలో ఓ మిల్లు నుంచి 112 టన్నులకు సంబంధించి రూ. 22.48 లక్షలు మాత్రమే వసూలు చేయాలి కానీ రూ.25 లక్షలు వసూలు చేశారు. ఇది కేవలం ఒక మిల్లులో జరిగిన బాగోతం మాత్రమే. వేల మిల్లుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడ్డారు. టెండర్ ధాన్యం 38 లక్షల టన్నుల్లో బిడ్డర్లు ఎత్తింది కేవలం 19 లక్షల టన్నులు మాత్రమే. ఈ మొత్తం ధాన్యం కూడా పేపర్లపైనే ఎత్తినట్టు చూపారు గానీ లారీ పెట్టలేదు.. సంచి ఎత్తలేదు. ఈ విధంగా టన్నుకు రూ.2300 చొప్పున 19 లక్షల టన్నులకు సుమారు రూ. 437 కోట్లకు పైగా కొల్లగొట్టడం గమనార్హం.
ధాన్యం టెండర్లకు సంబంధించి అదనపు వసూళ్లు, డిపాజిట్లు వెనక్కి ఇచ్చే కుతంత్రాల వెనక కీలక నేతలున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు టెండర్లు ఖరారయ్యాయి. ఆ సమయంలో బిడ్డర్ల వెనకున్న ఆస్థాన్లను ‘మచ్చి’క చేసుకొని ఢిల్లీకి మూటలు పంపినట్టు ఆరోపణలున్నాయి. ధాన్యం ఎత్తడంలో అదనపు వసూళ్లకు తాము సహకరిస్తామని, ఇప్పుడైతే నిధులు సమకూర్చాలని వారితో ఒప్పందం చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే పెద్దపెద్ద మూటలు ఢిల్లీకి చేరినట్టు వినిపిస్తున్నాయి.