వేలేరు, డిసెంబర్ 14 : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వగ్రామమైన హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. సర్పంచ్ స్థానంతోపాటు 8 వార్డులు గెలుచుకున్నది. గ్రామంలో 1,197 మంది ఓటర్లుండగా ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,032 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. సర్పంచ్ స్థానానికి ఆరుగురు పోటీ చేయగా, బీఆర్ఎస్ బలపర్చిన వెన్నం రమాదేవి పోటీలో ఉన్నారు. రమాదేవి తన సమీప అభ్యర్థి మెరుగు కోమలపై 390 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా 8 వార్డుల్లో 7 వార్డులను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకోగా, మరో వార్డులో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు.
అందోల్, డిసెంబర్ 14: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో కాంగ్రెస్ కంచుకోట నేరడిగుంటలో బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్‌గా గెలిచాడు. కాంగ్రెస్ సీనియర్ నేతను 30 ఏండ్ల యువకుడు మట్టికరిపించాడు. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రధాన అనుచరుడైన జోగిపేట మార్కెట్ చైర్మన్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జగన్మోహరెడ్డిపై బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసిన ఒగ్గు సాయికిరణ్ 500 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించాడు.