Heart Attack | తిమ్మాపూర్, ఆగస్టు 16: తమ్ముడు గుండెపోటుతో మరణించగా.. అతడి దశదిన కర్మ రోజు అన్న కూడా గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన ఉమ్మెంతుల చంద్రారెడ్డి, అరుణ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు శ్రీకాంత్‌రెడ్డి కరీంనగర్లో, చిన్నకొడుకు మధుసూదన్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు.
ఈ నెల 3న మధుసూదన్‌రెడ్డి (26) గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో అన్న తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తమ్ముడి దశదినకర్మ రోజైన ఈనెల 14న శ్రీకాంత్‌రెడ్డి (30) గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురికాగా, కుటుం బ సభ్యులు కరీంనగర్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. బుధవారం గుండెకు ఆపరేషన్ చేస్తుండగా పరిస్థితి విషమించి శ్రీకాంత్‌రెడ్డి మరణించాడు. కొడుకులిద్దరూ గుండెపోటుతో మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.